యడ్లపాడు: ప్రకృతిని కాపాడుకుంటూ.. రాబోయే తరాలకు పచ్చని భవిష్యత్తును అందించడమే ధ్యేయంగా ప్రతిఒక్కరూ ఆలోచన చేయాలని కొండవీడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (ఎఫ్.బి.ఓ) పురుషోత్తమరాజు పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అటవీశాఖ, ఫిరంగిపురం గ్రీన్ వారియర్స్ సభ్యులు సంయుక్తంగా శుక్రవారం పర్యావరణ పరిరక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్వచ్ఛగాన్, సురక్షిత్ జలధార వారోత్సవాల్లో భాగంగా చారిత్రక కొండవీడు ఘాట్ రోడ్డుతో పాటు హౌస్ గణేష్ కొండల పరిసర ప్రాంతాలలో సుమారు 650 విత్తన బంతులను (సీడ్‌బాల్స్) విసురుతూ ప్రకృతి పునరుజ్జీవ నానికి బాటలు వేశారు. నారింజ, చింత, వెలగ, సీతాఫలం, వేప, మరో విలువైన స్థానిక వృక్ష జాతికి చెందిన విత్తనాలతో సిద్ధం చేసిన విత్తన బంతులను ప్రకృతి ప్రేమికులు, సందర్శకులు కలిసి ఎంతో ఉత్సాహంగా కొండలపైకి విసిరారు. కార్యక్రమం ప్రారంభంలో పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను వివరించారు. ఒక మొక్క–ఒక జీవితం.. పచ్చదనం పెంచుదాం–భూమిని కాపాడుదామంటూ నినాదాలు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ప్రతిజ్ఞను చేశారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పురుషోత్తంరాజు మాట్లాడుతూ..ప్రస్తుత తరానికి మాత్రమే కాకుండా రాబోయే తరాలకు కూడా స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించడం మనందరి బాధ్యత. వృక్ష సంపదను పెంపొందించడం ద్వారా వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించవచ్చని తెలిపారు. ప్రస్తుత సమాజం ఎదుర్కొంటున్న వాతావరణ సమతుల్యత లోపాలను అరికట్టేందుకు వృక్ష సంపదను పెంచడమే ఏకై క మార్గమని హితవు పలికారు. గ్రీన్‌వారియర్స్ ప్రతినిధి శౌరి ఫ్రాన్సిస్ మాట్లాడుతూ.. కేవలం ప్రభుత్వాలు, అధికారుల వల్లే పర్యావరణ మార్పులు సాధ్యం కాదని, ప్రతి పౌరుడు ఏడాదికి ఒక మొక్క నాటి సంరక్షించినప్పుడే పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. యువతరం ప్రకృతి పరిరక్షణలో ముందుండాలని శ్రీనివాస్ కార్తీక్ పిలుపునివ్వగా, విద్యార్థుల్లో చిన్నతనం నుంచే పర్యావరణ స్పృహను పెంపొందించడం ద్వారానే భవిష్యత్తు సమాజంలో గొప్ప మార్పును చూడగలమని ఉపాధ్యాయుడు డాక్టర్ జున్ను అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కె వెంకటేశ్వరరావు, కొండవీడు వాచ్ అండ్ వార్డ్ సభ్యులు, గ్రీన్ వారియర్స్ సభ్యులు సుందరరావు మాస్టర్, చేనేత ఫ్రాన్సిస్ తదితరులు పాల్గొన్నారు.


