నాదెండ్ల: గణపవరంలో పొరుగు రైతు నిర్లక్ష్యం కారణంగా ఆరెకరాల జామాయిల్ తోట దగ్ధమై సుమారు రూ.6 లక్షల నష్టం వాటిల్లిన సంఘటన జరిగింది. బాధిత రైతులు కాట్రు శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, తూబాటి శేషగిరిరావు తెలిపిన వివరాల మేరకు.. వీరు సుమారు ఆరెకరాల్లో జామాయిల్ తోట సాగు చేస్తున్నారు. తమ తోటకు సమీపంలో చిలకలూరిపేట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి చెందిన 12 ఎకరాల భూమిని గ్రామానికి చెందిన జంపని వీరయ్య కుమారుడు శ్రీనివాసరావు సాగు చేస్తున్నాడు. ఈక్రమంలో ఈనెల 3వ తేదీన ఖరీఫ్ సాగుకు సిద్ధమయ్యేందుకు తన భూమిలోని వ్యర్థాలు సేకరించి జామాయిల్ తోట సమీపంలో కుప్పగా వేసి నిప్పంటించాడు. వేసవి కావటంతో మంటలు తోటకు అంటుకుని ఆరెకరాల తోట పూర్తిగా దగ్ధమైంది. దీంతో తమకు సుమారు రూ.6 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు పేర్కొన్నారు. ఈ విషయమై గురువారం బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవగా, స్థానిక పెద్దలు రాజీయత్నం చేశారు. అయితే రాజీయత్నం విఫలం కావటంతో శుక్రవారం బాధిత రైతులు నాదెండ్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదేరైతు గతేడాది కూడా ఇదేరీతిలో వ్యర్థాలకు నిప్పు పెట్టడంతో వెంకటేశ్వర్లుకు చెందిన జామాయిల్ తోట దగ్ధమైంది. అప్పట్లో బాధిత రైతుకు నష్టపరిహారం చెల్లించినట్లు సమాచారం.
పిడుగురాళ్లరూరల్: పొలం పనులకు వెళ్లి పిడుగుపాటుకు రైతు మృతి చెందిన సంఘటన పిడుగురాళ్ల మండలంలోని జూలకల్లు గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన అల్లం వెంకటరెడ్డి (45), తన భార్యతో కలిసి పత్తి విత్తనాలు వేసేందుకు పొలానికి వెళ్లాడు. ఈక్రమంలో ఉరుములతో కూడిన వర్షంతో పాటు పొలంలో పిడుగుపడడంతో వెంకటరెడ్డి అక్కడిక్కడే మృతి చెందాడు. భార్య కళావతి స్వల్ప గాయాలతో పొలంలో సృహతప్పి పడిపోయింది. ఇది గమనించిన తోటి రైతులు బంధువులకు సమాచారం అందించారు.
పొరుగు రైతు నిర్లక్ష్యంతోనే అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత రైతులు


