మ్యాపింగ్ కాకపోతే ఓటు కోల్పోయే పరిస్థితి
సత్తెనపల్లి: భారత ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఓటరు జాబితా సవరణ, కొత్త ఓటర్ల జాబితా తయారీకి సంబంధించి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్– సర్) ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 5 నుంచి 14వ తేదీ వరకు ‘సర్’ నిర్వహణపై సంబంధిత అధికారులు బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌ఓ)లకు శిక్షణ ఇవ్వనున్నారు. 15 నుంచి బూత్ లెవల్ అధికారులు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహిస్తారు. 2002 జాబితా ప్రకారం ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఓటరుగా ఉన్నారా లేదా అనేది పరిశీలిస్తారు.అక్కడ నివాసం లేని ఓటర్లను తొలగింపు జాబితాలో చేరుస్తారు. 2002లో అక్కడ ఓటు ఉన్నట్లయితే అందుకు సంబంధించి వివరాలను ఓటరు రక్తసంబంధీకులు బూత్‌లెవల్ అధికారులకు సమర్పిస్తే మ్యాపింగ్ చేస్తారు. ఒకే కుటుంబంలో ఓటర్లుగా ఉన్న వారందరినీ ఒకే బూత్‌లో ఉండేలా చూస్తారు.
మ్యాపింగ్ కాకపోతే ఇబ్బందే...
ఓటరుగా మ్యాపింగ్ కాకపోతే ఇబ్బంది తప్పదు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాలోని 1,932 పోలింగ్ కేంద్రాల పరిధిలో 17,41,798 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఇప్పటివరకు 11,06,750 మంది ఓటర్లు మ్యాపింగ్ జరిగింది. ఇంకా 6,35,048 మంది ఓటర్లు మ్యాపింగ్ కావలసి ఉంది. మ్యాపింగ్ చేసుకోని పక్షంలో ఓటు కోల్పోవాల్సి వస్తుంది. ఈ నెల 7 నుంచి 14 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తారు. అత్యధికంగా మ్యాపింగ్ కానీ ఓటర్లు వినుకొండ నియోజకవర్గంలో 1,04,763 మంది, మాచర్ల నియోజకవర్గంలో 1,01,798 మంది ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా పెదకూరపాడు నియోజకవర్గంలో 67,911 మంది, నరసరావుపేట నియోజకవర్గంలో 81,570, చిలకలూరిపేట– 88,429, సత్తెనపల్లి – 90,653, గురజాల – 99,924 మంది ఓటర్లు ఉన్నారు. మ్యాపింగ్‌లో లింక్ కాని వారు ఎన్యూమరేషన్ ఫామ్ నింపి ఇవ్వాలి. ఈ ప్రక్రియ గందరగోళంగా మారే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలి...
‘సర్’ విషయంలో రాజకీయ పార్టీలు తమ బీఎల్‌ఏ (బూత్ లెవెల్ ఏజెంట్లు)లు అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. మ్యాపింగ్ కాని ఓటర్ల వద్దకు వెళ్లి అవసరమైన డాక్యుమెంట్లతో సిద్ధంగా ఉండేలా చూడాలన్నాయి. బీఎల్‌ఓ వచ్చినప్పుడు వివరాలను సమర్పించేలా చూసి మ్యాపింగ్ చేయించాలి. 2002 ఓటరు జాబితాలో ఓటరుగా ఉన్న వ్యక్తి ప్రస్తుతం ఆ ఇంట్లో లేకపోతే .. ఆ ఇంట్లో ఉన్న ఆ ఓటర్ తాలూకు బంధువుల నుంచి వివరాలు ఇప్పించి మ్యాపింగ్ చేయించాలి.
ఓటు తొలగిస్తే ఆందోళన వద్దు...
ఒక ఇంటిలో ఓటరుగా ఉన్నప్పటికీ పొరపాటున ఓటు తొలగిస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జూలై 21వ తేదీన ముసాయిదా ఓటర్ జాబితా ప్రకటిస్తారు. ఆ రోజు నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. వచ్చిన అభ్యంతరాలను సెప్టెంబర్ 18వ తేదీలోగా పరిష్కరించి, అదే నెల 22న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తారు.


