వేడెక్కిన పేట రాజకీయం | - | Sakshi
Sakshi News home page

వేడెక్కిన పేట రాజకీయం

Jun 5 2026 4:11 AM | Updated on Jun 5 2026 4:11 AM

నేడు కోటప్పకొండ వేదికగా అభివృద్ధి, సంక్షేమంపై చర్చ డాక్టర్‌ చదలవాడ సవాల్‌ను స్వీకరించిన డాక్టర్‌ గోపిరెడ్డి

నరసరావుపేట: నియోజకవర్గంలో రాజకీయ వేడి ప్రారంభమైంది. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రధాన అధికార, ప్రతిపక్ష నాయకులు ఎవరి పావులు వారు కదుపుతున్నారు. అందులో భాగమే సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. వైఎస్సార్‌ సీపీ, టీడీపీ నాయకులు ఒకరినొకరు ప్రజలకు తాము చేసిన సేవలను ప్రజలకు తెలియచేయాలని నిర్ణయించారు. నియోజకవర్గంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ది, అందజేసిన సంక్షేమంపై శుక్రవారం చర్చించేందుకు టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సిద్ధమయ్యారు. అభివృద్దిపై తొలుత సవాల్‌ విసిరింది డాక్టర్‌ చదలవాడే. దీనికి స్పందించిన డాక్టర్‌ గోపిరెడ్డి .. చర్చకు తాను సిద్ధమని, ఆ చర్చా వేదిక పట్టణంలోని టౌన్‌హాలు లేదా కోటప్పకొండ వేదికగా ఉంటే బాగుంటుందని సూచించారు. దీనిపై గురువారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో తానూ కోటప్పకొండ వేదికగా సిద్ధమేనని డాక్టర్‌ చదలవాడ పేర్కొన్నారు. దీనిపై డాక్టర్‌ గోపిరెడ్డి స్పందిస్తూ కోటప్పకొండ దిగువ భాగంలో చర్చకు ఏర్పాట్లు చేయాలని, తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.

నాడు రూ. వేల కోట్ల లబ్ధి

2019–24మధ్యలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ద్వారా నియోజకవర్గ ప్రజలకు తాము రూ.2476 కోట్ల విలువైన అభివృద్ధి, సంక్షేమం అందజేసినట్లు ఇప్పటికే డాక్టర్‌ గోపిరెడ్డి ప్రకటించారు. పేదలందరికీ ఇళ్లు పథకం పరిశీలిస్తే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నియోజకవర్గంలో 14,700 మందికి ఇళ్ల పట్టాలు అందజేశారు. రెండేళ్ల చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్కరికీ ఇళ్ల పట్టా అందజేయలేదు. ముఖ్యమంత్రి రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా బాధితులకు రూ.7.45 కోట్లు అందజేశారు. జగనన్న విద్యాదీవెన ద్వారా 22,243 మంది విద్యార్థులకు రూ.70.7 కోట్ల ప్రయోజనం చేకూర్చారు. వసతి దీవెన ద్వారా మరో రూ.18 కోట్లు అందజేశారు. సుమారు రూ.74 కోట్ల వ్యయంతో రోడ్లను అభివృద్ధి చేశారు. పింఛన్‌ కానుక ద్వారా రూ.356.32 కోట్లు, అమ్మ ఒడికి రూ.119,80 కోట్లు, రైతు భరోసా కింద రూ.138.76 కోట్లు, డ్వాక్రా రుణమాఫీ ద్వారా రూ.144 కోట్లు, రుణాలు రూ.975 కోట్లు, నాడు–నేడు ద్వారా రూ.31.78 కోట్లు, 42 గ్రామ సచివాలయాల నిర్మాణానికి రూ.16.35 కోట్లు, 36 హెల్త్‌ క్లినిక్‌లకు రూ.6.82 కోట్లు, 31 ఆర్‌బీకేలను రూ.6.75 కోట్లు, విద్యుత్‌ సబ్‌స్టేషన్లకు రూ.13 కోట్లు, 11 కమ్యూనిటీ సెంటర్లను రూ.7.13 కోట్లను ఖర్చు చేశారు. మిల్క్‌సెంటర్లు రూ.6.13 కోట్లు, నాలుగు ప్రైమరీ హెల్త్‌ సెంటర్లకు రూ.6.07 కోట్లు, రూ.80 లక్షల వ్యయంతో అర్బన్‌ హెల్త్‌కేర్‌ సెంటర్‌, 2,718 మంది విద్యార్థులకు ట్యాబ్‌లు, పలు పాఠశాలల్లో టచ్‌స్క్రీన్‌లు 148, స్మార్టు టీవీలు ఏర్పాటు చేశారు. ఇంటింటికీ తాగునీటికి రూ.78 కోట్లు, జేఎన్‌టీయూ నిర్మాణానికి రూ.150 కోట్లు , 34.68 కి.మీ. సీసీ రోడ్లు, 15 కి.మీ. సీసీ డ్రెయిన్ల నిర్మాణం చేపట్టి పూర్తి చేశారు.

ఇప్పుడు అరకొర...

రెండేళ్ల చంద్రబాబు ప్రభుత్వంలో రూ.417 కోట్లతో సంక్షేమం, రూ.127 కోట్లతో అభివృద్ధి చేశానని చదలవాడ ప్రకటించారు. పీ4 పథకం ద్వారా రూ.50 కోట్ల విలువైన పనులు చేశామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement