నరసరావుపేట రూరల్: దేశాభివృద్ధిలో యువత కీలక భాగస్వామ్యంగా ఉండటం ద్వారానే దేశాభివృద్ది సాధ్యమవుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తెలిపారు. అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్రస్థాయి యువజన విద్యా, వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులు కోటప్పకొండలో కొనసాగుతున్నాయి. గురువారం కార్యక్రమాల్లో ఈశ్వరయ్య పాల్గొని మాట్లాడారు. దేశంలోని యువతను సన్మార్గంలో నడిపించి మత్తు పానీయాలు, గంజాయి, గుట్కా వంటి మత్తు పదార్థాల బారిన పడకుండా దేశభక్తిని పెంపొందించేందుకు శిక్షణ తరగతులు దోహదపడతాయని తెలిపారు. కులం, మతం, ప్రాంతం వైవిధ్యాలు లేకుండా వివిధ ప్రాంతాల నుంచి ప్రొఫెసర్లు, లెక్చరర్లతో శిక్షణా తరగతుల్లో అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. శిక్షణకు హాజరైన యువత మీ ప్రాంతాల్లోకి వెళ్లి యువకులను సమీకరించి జిల్లా స్థాయిలో శిక్షణ తరగతులు నిర్వహించాలని తెలిపారు. దేశంలో ప్రజల మద్య చిచ్చు పెట్టి విభజించు పాలించు అనే రీతిలో పరిపాలిస్తున్నారని, దీనికి మారణ హోమానికి కూడా వారు వెనుకాడరని ప్రజలందరూ దీనిని గమనించాలన్నారు. 12 సంవత్సరాల బీజేపీ పాలనలో ప్రజలపై అధిక ధరల భారాలు మోపిందని, దీనిని మోయలేక ప్రజలు అల్లాడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను పూర్తిగా నెరవేర్చడంలో విఫలమయిందని విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, యువజన సమాఖ్య జాతీయ అద్యక్షుడు రోషన్‌కుమార్ సింహ, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు యుగంధర్, సంతోష్‌కుమార్ పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
గుజ్జుల ఈశ్వరయ్య


