నరసరావుపేట రూరల్: ప్రభుత్వ పాఠశాలల పట్ల తల్లిదండ్రులకు నమ్మకం ఏర్పడే విధంగా ఉపాధ్యాయులు విద్యాభోధన చేయాలని జిల్లా సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. లింగంగుంట్ల శంకరభారతీపురం జెడ్పీ హైస్కూల్‌లో ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం గురువారం ప్రారంభించారు. 1,2 తరగతులు బోధించే ఉపాధ్యాయులు, మెగా డీఎస్సీలో ఎంపికై న ఉపాధ్యాయులకు అక్షరాస్యత, సంఖ్యాజ్ఞానంలో 60 రోజుల సర్టిఫికెట్ కోర్స్‌లో ఈనెల 9వ తేదీ వరకు శిక్షణ ఇవ్వనున్నారు. శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సౌకర్యాలు కల్పించడంతోపాటు, మెగా డీఎస్సీ 2025 ద్వారా జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాలు చేసినట్టు తెలిపారు. ఉపాధ్యాయులు ఇక్కడ నేర్చుకున్న జ్ఞానాన్ని తమ పాఠశాలల్లో అమలుపరిచి ప్రభుత్వ పాఠశాలలంటే నమ్మకం ఏర్పడే విధంగా బోధించాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఏఎంఓ పూర్ణచంద్రరావు, ఎస్‌సీఈఆర్‌టీ రాష్ట్ర పరిశీలకులు పి.రమేష్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా సమగ్ర శిక్ష అడిషనల్
ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ శ్యామ్ ప్రసాద్


