పేద కుటుంబాల పిల్లల పెళ్లి ఖర్చులకు ఆర్థిక సాయం చేసేందుకు గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అమలు చేసిన కల్యాణమస్తు, షాదీ తోఫాకు చంద్రబాబు ప్రభుత్వం మంగళం పాడేసింది. పెళ్లి కానుక ఇస్తామంటూ రెండేళ్లుగా ఊరించింది. ఏ ఒక్కరికీ కానుకలు అందజేయకుండానే పథకానికి పాతరేసి | - | Sakshi
Sakshi News home page

పేద కుటుంబాల పిల్లల పెళ్లి ఖర్చులకు ఆర్థిక సాయం చేసేందుకు గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అమలు చేసిన కల్యాణమస్తు, షాదీ తోఫాకు చంద్రబాబు ప్రభుత్వం మంగళం పాడేసింది. పెళ్లి కానుక ఇస్తామంటూ రెండేళ్లుగా ఊరించింది. ఏ ఒక్కరికీ కానుకలు అందజేయకుండానే పథకానికి పాతరేసి

Jun 4 2026 4:58 AM | Updated on Jun 4 2026 4:58 AM

పెళ్లికి వడ్డీతో రుణం సిగ్గుచేటు

‘పెళ్లి కానుక’కు మంగళం కల్యాణలక్ష్మి పేరుతో కొత్త ఎత్తుగడ డ్వాక్రా మహిళల ఇళ్లలో పెళ్లికి వడ్డీతో కూడిన రుణం పేదింటి వివాహాలకు ఇచ్చే సాయానికి ఎగనామం టీడీపీ సర్కారు మాయాజాలంపై మహిళలు మండిపాటు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో కల్యాణమస్తు, షాదీ తోఫా కింద సాయం

సాయం ఎగ్గొట్టడం తగదు

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఒక్కో పథకానికి చంద్రబాబు సర్కార్‌ మంగళం పాడేసింది. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలకు స్వస్తి పలికింది. కల్యాణ మస్తు, షాదీ తోఫాలను ఈ ప్రభుత్వం ఎత్తేసింది. పెళ్లికానుక అంటూ ఊరించి ఉసురుమనిపించింది. ఇప్పుడు కల్యాణ లక్ష్మి పథకం కింద పేదింటి బిడ్డల పెళ్లి ఖర్చులకు వడ్డీతో కూడిన రుణమిస్తామని చెప్పటం సిగ్గుచేటు.

– తుమ్మల లక్ష్మీసుజాత,

మాజీ కౌన్సిలర్‌, సత్తెనపల్లి

సత్తెనపల్లి: చేసిన సాయం శూన్యమైనా .. ఏదో ఇస్తున్నట్టు నమ్మించడం .. ప్రచారం చేయడం .. జనాన్ని ముంచేయడంలో చంద్రబాబుకు మించిన వారు ప్రపంచంలోనే ఉండరన్నది రాజకీయ విశ్లేషకులు తరచూ చెప్పే మాట. అధికారం కోసం హామీలు గుప్పించడం .. అధికారం చేతికి చిక్కాక మోసం చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.

ఎన్నికల సమయంలో ఆడబిడ్డ నిధి అంటూ మహిళలను ఊరించారు. నెలకు రూ. 1,500 చొప్పున మహిళల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి మోసం చేశారు. పేద కుటుంబాల పిల్లల వివాహాల సమయంలో పెళ్లి కానుకతో ఆదుకుంటామని నమ్మించారు. రెండేళ్లలో ఏ ఒక్కరికీ పథక లబ్ధి కలిగించకుండానే ఎత్తేశారు. ఇప్పుడు కల్యాణలక్ష్మి పేరుతో పెళ్లి ఇంటికి పావలా వడ్డీ రుణం అందజేస్తామని చెబుతుండడంపై డ్వాక్రా మహిళలు నివ్వెరపోతున్నారు. ఇదెక్కడ రుణ పథకం అంటూ మండిపడుతున్నారు. గతంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పేదింటి బిడ్డల వివాహానికి కల్యాణమస్తు, షాదీ తోఫా కింద ఉచితంగా సాయమందించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల సంక్షేమానికి పాతరేస్తున్నారని, పేదల కష్టాలు పట్టడం లేదని వాపోతున్నారు. రెండేళ్లలో వివాహంతో ఒకటైన జంటలు రూపాయి సాయానికి నోచుకోలేదని నిట్టూ రుస్తున్నారు.

అప్పుడు అలా..

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వైఎస్‌ జగన్‌ సీఎంగా కల్యాణమస్తు, షాదీతోఫా పేరుతో పేద కుటుంబాల్లో కొత్తగా పెళ్లి అయిన ఆడబిడ్డలకు ఆర్థిక సాయం అందించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఇళ్లలో ఆడబిడ్డలకు, దివ్యాంగుల వివాహాలకు రూ.40 వేల నుంచి రూ. 1.50 లక్షల వరకు సర్కార్‌ సాయం చేసేది. ఇది పేద కుటుంబాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉండేది.

మహిళలకు బురిడీ...

చంద్రబాబు సర్కార్‌ ఏ పథకం అమలు చేసినా దాని వెనుక ఒక మెలిక ఉంటుందన్నది జనం మాట. దీనికి కల్యాణ లక్ష్మి పథకమే నిదర్శనమని చెబుతున్నారు. ఈ పథకం కింద డ్వాక్రా సంఘాల మహిళల ఇంట్లో వివాహానికి రుణం ఇవ్వనున్నారు. రూ. 10 వేల నుంచి రూ. లక్ష వరకు రుణం ఇస్తారట. ఇచ్చిన రుణం వడ్డీ సహా తీర్చాల్సిందే. అప్పుగా ఇచ్చే పథకానికి కూడా చంద్రబాబు సర్కార్‌ ఉచితంగా సాయం చేసినట్టు ప్రచారం చేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందజేయడం లేదు. పావలా వడ్డీ రుణాలను ఎగ్గొట్టేశారు. ఇప్పుడు కల్యాణలక్ష్మి పేరుతో ఉచితంగా అందజేయాల్సిన పెళ్లి సాయాన్ని కమర్షియల్‌గా మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కల్యాణమస్తు, షాదీ తోఫాలాంటి ఉచిత సాయాన్ని ఎగ్గొట్టి పెళ్లిని రుణమయంగా మార్చడం సమంజసం కాదు. పేదింటి బిడ్డల పెళ్లికి ఉచిత సాయం అందించాల్సింది పోయి ఇచ్చే సాయానికి వడ్డీ సహా చెల్లించాలనడం సరైనది కాదు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం పేదింటి బిడ్డల పెళ్లికి ఉచిత సాయం అందించాలి. ఆ విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. లేకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు.

– ఉల్లంఘుల విజయలక్ష్మి,

మహిళా నాయకురాలు, సత్తెనపల్లి

Advertisement
 
Advertisement
Advertisement