పరిశ్రమలకు ప్రోత్సాహం అవసరం
జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ సంజనా సింహ
నరసరావుపేట: అమరావతి మండలంలో భూ సమీకరణకు అంగీకరించిన రైతుల వివరాలతోపాటు దేవదాయ, రెవెన్యూ శాఖల భూముల రికార్డులను త్వరితగతిన క్రోడీకరించి సీఆర్డీఏకు ఇవ్వాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ సంజనా సింహ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ల్యాండ్ పూలింగ్, భూముల వివరాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ... ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ వేగవంతం చేసి, రైతులకు సకాలంలో త్వరితగతిన పరిహారం అందించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ఇందుకోసం వివిధ శాఖల మధ్య సమాచార మార్పిడి సులభంగా, వేగంగా జరగాలని సూచించారు. సత్తెనపల్లి ఆర్డీవో శ్రీరాములు, అమరావతి మండల అధికారులు సమన్వయంతో పనిచేసి పూర్తి వివరాలు అందజేయాలని కోరారు. ఈ పరిధిలో ఉన్న దేవదాయ భూములు, రిజిస్టర్ అయిన, కాని భూములు, జరీబ్ భూములు, చెరువులు, కాలువ పోరంబోకు తదితర భూములను క్షేత్రస్థాయిలో సర్వే చేసి, స్పష్టమైన నివేదికను సిద్ధం చేయాలన్నారు. సత్తెనపల్లి ఆర్డీవో శ్రీరాములు, సీఆర్‌డీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమణకాంత రెడ్డి, అమరావతి తహసీల్దార్ నగేష్ పాల్గొన్నారు.
‘సర్’పై సిబ్బందికి ప్రత్యేక శిక్షణ
‘సర్’ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయడానికి సంబంధిత సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ సంజనా సింహ అధికారులను ఆదేశించారు. సర్‌పై రాష్ట్రస్థాయిలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉన్నతాధికారులు ఇచ్చిన సూచనలను అనంతరం జిల్లా అధికారులతో టెలీకాన్ఫెరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, కచ్చితత్వం అత్యంత ముఖ్యమని తెలిపారు. ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, బీఎల్‌ఓలకు సమగ్రంగా శిక్షణ ఇచ్చి, క్షేత్రస్థాయిలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూడాలని సూచించారు. ఓటర్ల వివరాల మ్యాపింగ్ ప్రక్రియలో అసాధారణతలు, డూప్లికేషన్లు, ఇతర సాంకేతిక లోపాలు గుర్తిస్తే వెంటనే సరిచేసే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి దశను జాగ్రత్తగా పరిశీలిస్తూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లాలో సర్ కార్యక్రమాన్ని నిర్దేశిత గడువుల్లో పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
వసతి గృహాలలో నెట్ జీరో–హెల్తీ క్యాంపస్
జిల్లాలో వసతి గృహాలను నెట్ జీరో – హెల్తీ క్యాంపస్‌లుగా తీర్చిదిద్దనున్నట్లు జిల్లా ఇన్‌చార్జి కలెక్టరు సంజనా సింహ పేర్కొన్నారు. బుధవారం నెట్ జీరో – హెల్తీ క్యాంపస్‌ల కార్యక్రమంపై జిల్లా స్థాయి కమిటీ సభ్యులతో కలెక్టరేట్ నుంచి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరు మాట్లాడుతూ రాబోయే రెండేళ్లలోగా అన్నీ ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలకు నెట్ జీరో – హెల్తీ క్యాంపస్‌లుగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కమిటీ సభ్యులు డ్వామా పీడీ లింగమూర్తి, డీఆర్‌డీఏ పీడీ ఝాన్సీరాణి, మునిసిపల్ కమిషనరు బి.రమ్య కీర్తన, జిల్లా పంచాయతీ అధికారి నాగేశ్వరనాయక్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో పరిశ్రమల స్థాపన కోసం పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) అజెండాను సమర్థంగా అమలు చేయాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ సంజనా సింహ దిశానిర్దేశం చేశారు. బుధవారం కలెక్టరేట్‌లో ఇన్‌చార్జి కలెక్టర్ అధ్యక్షతన జిల్లా డీఐఈపీసీ సమావేశం నిర్వహించారు. కమిటీ సమన్వయ కర్త, జిల్లా పరిశ్రమల అధికారి సజ్జా వెంకట సురేష్ 14 అంశాల అజెండా వివరించారు. గత నెల 24న సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై చర్యల నివేదికను వివరించారు. అనంతరం సింగల్ డెస్క్ దరఖాస్తుల స్థితిగతులపై వివరణ ఇచ్చారు. సమీప భవిష్యత్తులో రాబోతున్న పరిశ్రమలపై అవగాహన, వారికి ఎదురవుతున్న సమస్యలపై నివేదిక సమర్పించారు. పలు సంస్థల ప్రతినిధులు తమ ప్రాజెక్టుల గురించి వివరించారు. ఏపీఎస్‌ఎఫ్‌సీ బ్రాంచ్ మేనేజర్ పి.వెంకయ్య, ఏపీసీపీడీసీఎల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బి.యలమంద, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ ఎంఎల్. నరసింహారావు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ కేఎస్ రామ్‌ప్రసాద్, డిస్ట్రిక్ట్ గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ కె.రామబాలాజీరెడ్డి, డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ ఐ.వెంకటరావు, డీఆర్‌డీఏ పీడీ పి.ఝాన్సీరాణి, ఎన్‌ఆర్‌ఈడీసీ అభివృద్ధి అధికారి ఆర్.భువనేష్ తదితరులు పాల్గొన్నారు.


