పదవి వరించినా పరుగే! | - | Sakshi
Sakshi News home page

పదవి వరించినా పరుగే!

Jun 4 2026 4:58 AM | Updated on Jun 4 2026 4:58 AM

పదవి వరించినా పరుగే! వేధింపులే కారణమా?

నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో సూపరింటెండెంట్‌ కుర్చీ అంటే హడల్‌ ఆరుగురు పేర్లు పరిశీలించినా ఒక్కరూ ముందుకు రాని సీనియర్లు తప్పని పరిస్థితుల్లో జూనియర్‌ వైద్యునికి పదవి అప్పగింత ఆస్పత్రిలో సమస్యలు, రాజకీయ వేధింపులే కారణమంటున్న వైద్యవర్గాలు

అత్యున్నత స్థాయి కుర్చీ కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తుంటారు.. కానీ ఇక్కడ ఆ కుర్చీలో ఎక్కడ కూర్చోపెడతారోనని పారిపోయేందుకు పావులు కదుపుతున్నారు. పెత్తనం చలాయించే పదవి అంటే ఎవరైనా ఆసక్తి చూపుతారు. కానీ నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో సూపరింటెండెంట్‌ పోస్ట్‌ అంటేనే ఆరుగురు సీనియర్లు సైతం వెనుకడుగు వేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

నరసరావుపేట టౌన్‌: సాధారణంగా ఉన్నత హోదా అంటే పోటీ, లాబీయింగ్‌, సిఫార్సులు సహజం. అలాంటిది నరసరావుపేట ఏరియా వైద్యశాలలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఆసుపత్రిలో అత్యంత కీలకమైన సూపరింటెండెంట్‌ పదవికి డాక్టర్‌ సురేష్‌ కుమార్‌ రాజీనామా చేశారు. ఆ స్థానంలో కూర్చోబెట్టేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తుంటే, వైద్యులు తప్పించుకుంటున్నారు. హోదా, గౌరవం, కీలక నిర్ణయాధికారం కలిగిన పదవి అయినప్పటికీ ఆ బాధ్యతలు వద్దంటూ సీనియార్టీ లిస్ట్‌లో ఉన్న డాక్టర్‌లు వెనుకడుగు వేస్తున్నారు. ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్‌ పోస్టు చాలా మంది వైద్యుల కెరీర్‌లో ప్రతిష్టాత్మక మైలు రాయిగా భావిస్తారు. అయితే నరసరావుపేట ఏరియా ఆసుపత్రిలో మాత్రం వారిలో భయాన్ని కలిగిస్తోంది. సమస్యలతో నిత్యం సతమతమవుతున్న ఆసుపత్రి పరిస్థితులు, రాజకీయ జోక్యం, ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు, పరిపాలన ఇబ్బందులు ఈ పదవికి దూరంగా ఉండేందుకు ప్రధాన కారణాలుగా వైద్యులు పేర్కొంటున్నారు. ఆరుగురు సీనియర్‌ వైద్యుల పేర్లను పరిశీలించినప్పటికీ అందరూ ససేమిరా అన్నారు. చివరకు లిస్ట్‌లో చివరిగా ఉన్న జూనియర్‌ వైద్యుడికి బాధ్యతలు అప్పగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రెండు రోజుల్లో ఉత్తర్వులు

డీసీహెచ్‌ఎస్‌గా కొనసాగుతున్న డాక్టర్‌ ప్రసున్నాను సూపరింటెండెంట్‌గా అదనపు బాధ్యతలు చేపట్టాలని అధికారులు కోరగా ఆమె నిరాకరించారు. దీంతో వైద్యశాల్లో సీనియార్టీ లిస్ట్‌లో ఉన్న గైనికాలజిస్ట్‌ డాక్టర్‌ విజయలక్ష్మి, చర్మ వ్యాధుల నిపుణులు డాక్టర్‌ అంకినీడు ప్రసాద్‌, ఆర్థోపెడిక్‌ డాక్టర్‌ చైతన్య, అనస్థీషియా డాక్టర్‌ వెంకట్రావు, జనరల్‌ సర్జన్‌ డాక్టర్‌ కౌమది తదితరులను సంప్రదించినప్పటికీ వారు కూడా ఆసక్తి చూపలేదు. తాము ఆ పదవి చేపట్టేదుకు సుముఖంగా లేమని తేల్చి చెప్పారు. సీనియారిటీ లిస్ట్‌లో ఉన్న వైద్యులు ముందుకు రాకపోవటంతో చిన్న పిల్లల డాక్టర్‌ సతీష్‌ను సూపరింటెండెంట్‌గా ఉండాలని ఒప్పించి చివరకు ఆయన పేరును సిఫార్స్‌ చేస్తూ ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. అధికారకంగా మరో రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలవడనున్నట్లు తెలియవచ్చింది.

చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే ముగ్గురు సూపరింటెండెంట్‌లు మారారు. రాజకీయ వేధింపులే కారణమని వైద్య వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైద్యశాలలో అనుమతులు లేకుండా మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వ్యతిరేకించిన అప్పటి సూపరింటెండెంట్‌ మంత్రునాయక్‌పై అధికార పార్టీ నాయకులు వేధింపులకు దిగారు. తర్వాత బదిలీపై వెళ్లారు. తర్వాత డాక్టర్‌ రంగారావును నియమించినా రాజకీయ ఒత్తిళ్లతో నాలుగు నెలలకే వెళ్లిపోయారు. ఏడాది క్రితం డాక్టర్‌ సురేష్‌ కుమార్‌ను నియమించారు. సమస్యలు సరిచేయలేక అవస్థలు పడ్డారు. ప్రతి అంశంలో రాజకీయ జోక్యం, మరో వైపు ఉన్నతాధికారుల వేధింపులతో ఆయన తన పదవికి రాజీనామా సమర్పించినట్లు వైద్యవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సూపరింటెండెంట్‌లు పదవి వీడుతుండటంతో రోగులకు అందే వైద్య సేవలపై తీవ్ర ప్రభావం పడుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement