తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని భారత వాతావరణ శాఖ చైన్నె రీజనల్ హెడ్ డాక్టర్ డి.శివానంద బుధవారం సందర్శించారు. స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ ఉపయోగించే అత్యాధునిక సాంకేతికతను పరిశీలించారు. అనంతరం వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావంపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విపత్తుల సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. కౌసర్ బానో మాట్లాడుతూ తుఫాన్‌లు, భారీ వర్షాలు, పిడిగుపాటు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించేందుకు భారత వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థ, ఆర్జీజీఎస్ అవేర్ సంయుక్తంగా పనిచేస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో అమరావతి వాతావరణ కేంద్ర డైరెక్టర్ స్టెల్లా, ఎస్‌డీఎంఏ పరిపాలనా అధికారి కొడారి రవిబాబు, ఎస్‌ఈఓసీ ఇన్‌చార్జి పీటర్, ఐఎండీ శాస్త్రవేత్త సాగర్ పాల్గొన్నారు.
మంగళగిరి టౌన్: సెక్యూరిటీ గార్డుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 7వ తేదీన రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నట్లు ఏపీ ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్స్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ముజఫర్ అహ్మద్ తెలిపారు. మంగళగిరి పట్టణం సీఐటీయూ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముజఫర్ మాట్లాడుతూ మంగళగిరి పట్టణ పరిధిలోని రత్నాల చెరువు వద్ద ఉన్న సింహాద్రి శివారెడ్డి భవనంలో సదస్సు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణరావు, యూనియన్ మంగళగిరి కార్యదర్శి బుచ్చిబాబు, నాయకులు సునీత, బాలాజీ పాల్గొన్నారు.
చందోలు(కర్లపాలెం): ప్రముఖ నేపథ్య గాయకుడు మనో దంపతులు బుధవారం చందోలు బగళాముఖి అమ్మ వారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం మనో దంపతులకు ఆలయ ఈవో నరసింహమూర్తి అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. చందోలు ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టిన కె.మాధవరావు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. మడకసిర మాజీ ఎమ్మెల్సీ తిప్పె స్వామి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
నరసరావుపేట: కృత్రిమ మేధ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించే వైద్య పరీక్షలతో బాలబాలికల ఆరోగ్య స్థితిని గుర్తించి సత్వరంమెరుగైన సేవలు అందించినప్పుడే వారి వికాసం సాధ్యమవుతుందని ఒంగోలు ప్రాంతీయ సంచాలకులు బత్తుల మనోరంజని పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో సీడీపీఓలు, సూపర్వైజర్లు, మెడికల్ ఆఫీసర్లకు జీరో టూ సిక్స్ ఇయర్స్ చిల్డ్రన్స్‌పై ఆర్టిఫీషియల్ స్క్రీనింగ్‌పై జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. దీనికి మనోరంజని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మెదడు అభివృద్ధి, హైపర్ యాక్టివిటీ, ఐసీడీఎస్ లక్ష్యాలు, ఏఐ ద్వారా అవగాహన కల్పించారు. ఐసీడీఎస్ పీడీ ఉమాదేవి మాట్లాడుతూ ఆరోగ్యశాఖ, ఐసీడీఎస్ విభాగాల సమన్వయంతో పనిచేయాలన్నారు. మాచర్ల సీడీపీఓ కృష్ణవేణి నవచైతన్యంపై అవగాహన కల్పించారు. ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ పద్మావతి, డీఐఓ రోహిణి రత్నశ్రీ, జిల్లా కోఆర్డినేటర్ బి.మాణిక్యరావు, నోడల్ ఆఫీసర్ అరుణ(రేపల్లె) పాల్గొన్నారు.


