జిల్లా కమిటీ సమావేశంలో ఎం. హరిబాబు
నరసరావుపేట: రాష్ట్రంలో 70 శాతానికిపైగా ఉన్న కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు జారీ చేసి, రాయితీ రుణాలు అందించాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పల్నాడు విజ్ఞాన కేంద్రంలో బుధవారం సంఘం జిల్లా అధ్యక్షుడు జి.పిచ్చారావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో హరిబాబు మాట్లాడారు. వారి కోసం ప్రత్యేక చట్టం తీసుకురావడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఖరీఫ్ నేపథ్యంలో కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియ చేపట్టలేదని విమర్శించారు. గ్రామ సభలు నిర్వహించి అర్హులైన వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కౌలు రైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి వై. రాధాకృష్ణ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో గుర్తింపు పొందిన కౌలు రైతులందరికీ ప్రస్తుత ప్రభుత్వం కూడా ‘అన్నదాత సుఖీభవ’ పథకం ప్రయోజనాలను కల్పించాలని డిమాండ్ చేశారు. సంఘం నాయకులు పి.మహేష్, లక్ష్మణరావు, షేక్ ఖాసిం, ఎస్. లూదర్ పాల్గొన్నారు.


