చెలరేగిపోతున్న ఇసుకాసురులు | - | Sakshi
Sakshi News home page

చెలరేగిపోతున్న ఇసుకాసురులు

Jun 3 2026 1:03 AM | Updated on Jun 3 2026 1:03 AM

చెలరేగిపోతున్న ఇసుకాసురులు కృష్ణానదిలో ఇసుక తవ్వకాలపై నిషేధం ఉన్నా ఆగని అక్రమాలు

ఎన్జీటీ ఆదేశాలు బేఖాతరు...

నిషేధం ఉన్నా తవ్వకాలు...

షాడో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో...

కృష్ణానదిలో ఇసుక తవ్వకాలపై నిషేధం ఉన్నా ఆగని అక్రమాలు

సాక్షి, నరసరావుపేట: తమ్ముళ్ల ధనదాహానికి అంతే లేకుండా పోతోంది. పగలు, రాత్రి అంటూ తేడా లేకుండా వందల లారీల ఇసుకను సరిహద్దు దాటించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుక సరఫరాలో ప్రభుత్వానికి ఆదాయం రాకపోగా సామాన్యులకు ఇసుక అందుబాటులో లేకుండా పోయింది. అక్రమార్కులు ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. మైనింగ్‌, విజిలెన్స్‌, రెవెన్యూ, పోలీసు అధికారులకు తెలిసే ఇదంతా జరుగుతున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇసుకాసురులు ఇస్తున్న ముడుపులతో దోపిడీకి సహకరిస్తున్నారనే ఆరోపణ ఉంది.

అచ్చంపేట, అమరావతి మండలాల పరిధిలోని ఇసుక రీచ్‌లలో స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌ అనుచరులు ఇసుకను దోచేస్తున్నారు. ముఖ్యంగా చింతపల్లి రీచ్‌లో గత నెల ఆగమేఘాల మీద తమకు అనుకూలంగా ఉన్న ఓ మైనింగ్‌ కంపెనీకి అనుమతులు దక్కించుకున్నారు. ఈ కంపెనీ కేవలం అనుమతుల కోసం ఉపయోగించారని, స్థానికంగా షాడో ఎమ్మెల్యేగా పేరొందిన ప్రజాప్రతినిధి బంధువు కనుసన్నుల్లో అక్రమ మైనింగ్‌ జరుగుతోందని సమాచారం. ఈ రీచ్‌కు ఇచ్చిన అనుమతుల్లో కేవలం ఒక మీటర్‌ లోతు మాత్రమే చిన్న యంత్రాలతో తవ్వడానికి అనుమతి ఉంది. భారీ యంత్రాలతో ఏకంగా 4 నుంచి 5 మీటర్ల లోతు ఇసుకను తవ్వారు. 15 రోజుల్లోనే సుమారు 2 లక్షల టన్నుల ఇసుకను తవ్వేశారని, దీనిపై ఎంకై ్వరీ కమిటీ వేస్తే అసలు నిజాలు భయపడతాయని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. అమరావతి మండలం పొందుగల–3 రీచ్‌ను నామినేటెడ్‌ టెండర్‌ రూపంలో అధికార పార్టీ నేతలకు కట్టబెట్టారు. ఈ రీచ్‌లో నిబంధనల ప్రకారం యంత్రాలు వినియోగించకూడదు. అయితే 8 భారీ జేసీబీలతో మైనింగ్‌ జరుగుతోంది. ఇసుక అక్రమ దందాలో వచ్చిన డబ్బు వాటాలను పంచుకోవడానికి ఏకంగా గుంటూరు నగరం జేకేసీ కాలేజీ రోడ్డులోని ఓ అపార్టుమెంట్‌లోని మొదటి అంతస్తులో కార్యాలయం ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం. ఇసుక అక్రమ రవాణాపై ఇప్పటికే అన్ని ఆధారాలతో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లకు పెదకూరపాడుకు చెందిన కొందరు టీడీపీ నేతలు ఇప్పటికే ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.

నది పరివాహక ప్రాంతాల్లో వర్షాకాలం దృష్ట్యా జూన్‌ 1 నుంచి అక్టోబరు 15వ తేదీ వరకు నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ నిబంధనల మేరకు ఇసుక తవ్వకాలపై నిషేధం ఉంది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం.. కృష్ణా తీరంలో ఏటా విధించే ‘మాన్‌సూన్‌ హాలీడే’ (వర్షాకాల విరామం) జూన్‌ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. వర్షాకాలంలో నదుల్లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం, వరదలు వచ్చే అవకాశం ఉండటంతో ఇసుక తవ్వకాలు ప్రమాదకరం. ఈ సమయంలో నది జీవజాలం, పర్యావరణ పునరుజ్జీవనానికి ఈ విరామం ఎంతో అవసరం. అచ్చంపేట, అమరావతి మండలాల్లో జూన్‌ 1, జూన్‌ 2వ తేదీలలో సైతం రాత్రి, పగలు లేకుండా భారీ వాహనాలతో ఇసుకను తరలిస్తున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అధికార పార్టీ, అధికారులు వాటిని పాత ఫొటోలు అంటూ బుకాయించే అస్కారం లేకుండా ఫొటోలలో తేదీ, సమయంతోపాటు లాగిట్యూడ్‌, లాటిట్యూడ్‌ సైతం ఉండటం గమనార్హం. వాస్తవానికి ప్రభుత్వం ప్రత్యేక నిఘా బృందాలను రంగంలోకి దించాలి. మైనింగ్‌, రెవెన్యూ, జలవనరుల శాఖ, పోలీస్‌, రవాణా శాఖలు సంయుక్తంగా కృష్ణానది తీరప్రాంతాల్లో గస్తీ కాయాల్సి ఉంది. ఇసుకను అక్రమంగా తరలిస్తే వాహనాల సీజ్‌, భారీ జరిమానాలు, క్రిమినల్‌ కేసులు కూడా నమోదు చేయాలి. కానీ ఇవేవీ పెదకూరపాడు నియోజకవర్గంలో జరగడం లేదు.

కృష్ణానది రీచ్‌లలో

బరి తెగిస్తున్న అక్రమార్కులు

భారీ యంత్రాలు పెట్టి తరలిస్తున్న

ఎమ్మెల్యే భాష్యం అనుచరులు

నిబంధనలకు విరుద్ధంగా

రాత్రి పూట సైతం మైనింగ్‌

పట్టించుకోని మైనింగ్‌,

విజిలెన్స్‌, పోలీసు అధికారులు

పర్యావరణ నిబంధనల ప్రకారం ఇసుక రీచ్‌లలో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేయకూడదని ఎన్జీటీ ఆదేశాలు ఉన్నాయి. పెదకూరపాడు నియోజకవర్గంలో వాటిని కాలరాస్తూ ఇసుక అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. అచ్చంపేట, అమరావతి మండలాల పరిధిలో కృష్ణానదిలో దారులను ఏర్పాటు చేసి భారీ యంత్రాలను తరలించి రాత్రిపూట లారీలలో ఇసుక లోడింగ్‌ చేస్తున్నారు. ఎన్జీటీ ఆదేశాల మేరకు సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు ఇసుక కోసం నదిలోకి ఎటువంటి వాహనాలు దిగకూడదు. ఇసుక తవ్వకాలు ఏమాత్రం జరపకూడదు. ఇసుకాసురులు భారీ యంత్రాల సహాయంలో రాత్రిపూట వందల కొద్దీ లారీల ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆయా లారీలను బెల్లంకొండ, పిడుగురాళ్ల, దాచేపల్లి మీదుగా తెలంగాణ రాష్ట్రానికి తరలిస్తున్నారు. అసలే ఇసుక లభ్యత తక్కువగా ఉండటం, ఉన్న ఇసుక ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా జరుగుతుండటంతో జిల్లా వాసులు అధిక ధర పెట్టి బ్లాక్‌లోనే కొనాల్సి వస్తోంది.

ఉచిత ఇసుక మాటున టీడీపీ నేతలు రూ.కోట్లు వెనుకేసుకుంటున్నారు. నిబంధనలను పక్కన పెట్టి నదీగర్భాన్ని చీల్చి సొమ్ము చేసుకుంటున్నారు. కృష్ణమ్మ సంపదను ఇసుకాసురులు దర్జాగా దోచుకుంటున్నా అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. దీంతో వారు రెచ్చిపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా క్రోసూరు సభలో ప్రసంగించిన చంద్రబాబు నాయుడు... కృష్ణానదిలో అక్రమ ఇసుక రవాణా జరగనివ్వనని ప్రగల్భాలు పలికారు. తీరా అధికారంలోకి వచ్చాక స్థానిక ప్రజాప్రతినిధి అండదండలతో నిత్యం వందల లారీల ఇసుక తరలిపోతుంటే కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు.

Advertisement
 
Advertisement
Advertisement