ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు

Jun 3 2026 1:03 AM | Updated on Jun 3 2026 1:03 AM

వెల్దుర్తి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారంలోకి రాకముందు సూపర్‌ సిక్స్‌తోపాటు 143 హామీలిచ్చారని, పదవి చేపట్టి రెండేళ్లయినా ఒక్క పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని వైఎస్సార్‌సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. వెన్నుపోటుకు రెండేళ్లు బుక్‌లెట్‌, పోస్టర్లను మంగళవారం వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.... సీఎం చంద్రబాబు అధికారంలోకి రాకముందు అనేక మోసపూరిత వాగ్దానాలు చేసి ప్రజల ఓట్లు దండుకొన్నారని తెలిపారు. గెలిచాక రెండేళ్లయినా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా పూర్తిగా అమలు చేయలేదన్నారు. ప్రతి మహిళకు నెలకు రూ. 1500, నిరుద్యోగులకు రూ.3 వేలు, ఇళ్లు లేని ప్రతి ఒక్కరికీ స్థలాలు, గృహ నిర్మాణానికి నిధులు, రైతులకు అన్నదాత సుఖీభవ, నిరుద్యోగులకు భృతి వంటి కార్యక్రమాలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. సంక్షేమ పథకాలు ఇవ్వకుండానే సూపర్‌సిక్స్‌పై ఊదరగొడుతున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించటం తప్ప ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా పూర్తిగా అమలు చేయలేదన్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలివేసి కార్పొరేట్‌ సంస్థలకు ఎకరాలకు ఎకరాలు కట్టబెడుతున్నారని తెలిపారు. పేదవారు నివాసం ఉండటానికి కొద్దిపాటి స్థలం కూడా చూపించలేని సీఎం చంద్రబాబు కార్పొరేట్‌ వారికి మాత్రం రెడ్‌ కార్పెట్‌ వేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా వైఎస్సార్‌ సీపీ ఉపాధ్యక్షుడు దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జిల్లా నాయకులు, బూడిద శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్‌ మందా సంతోష్‌, వైఎస్సార్‌సీపీ నాయకులు షేక్‌ మస్తాన్‌, మద్దిగపు పాపిరెడ్డి, కొమ్ము బొంగురు, పోలా శ్రీనివాసరావు, పోతురెడ్డి కోటిరెడ్డి, చిల్లంచర్ల సత్యనారాయణ, వినోద్‌, కంభంపాటి అమర్‌ తదితరులున్నారు.

వైఎస్సార్‌ సీపీ పల్నాడు జిల్లా

అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement