నరసరావుపేటటౌన్: ఐసీయూ విభాగానికి వేసిన తాళాలకు సాక్షి కథనంతో మోక్షం లభించింది. నరసరావుపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఐసీయూను నిరుపయోగంగా మార్చి విభాగానికి తాళాలు వేసిన వ్యవహారంపై ఇంటెన్సివ్ కేర్ ఏది? అనే శీర్షికతో సాక్షిలో సోమవారం ప్రచురితమైన కథనానికి వైద్య శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. వైద్యవిధాన పరిషత్ పల్నాడు జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ప్రసున్న మంగళవారం వైద్యశాలను సందర్శించారు. ఐసీయూ విభాగాన్ని పరిశీలించి సూపరింటెండెంట్ డాక్టర్ సురేష్‌కుమార్‌కు తగు సూచనలు చేశారు. కావాల్సిన పరికరాలు, పడకలు, వసతులు ఉన్నప్పటికీ ఐసీయూ నిరుపయోగంగా ఉంచటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐసీయూ విభాగానికి ఇన్‌చార్జిగా మత్తు డాక్టర్ వెంకట్రావును నియమించారు. కావాల్సిన సిబ్బందిని ఏర్పాటు చేసి సత్వరమే అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. గత కొన్ని నెలలుగా ఏరియా వైద్యశాల లోని ఐసీయూ విభాగాన్ని అధికారుల నిర్లక్ష్యంతో తాళాలు వేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను ఐసీయూ అందుబాటులో లేని కారణంగా గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తున్నారు. దీంతో మెరుగైన వైద్యం అందక కొందరు మృతి చెందారు. అదేవిధంగా రోగులు వారి సహాయకులు వ్యయప్రయాసాలకు గురవుతున్నారు. సాక్షి కథనంతో అధికారులు స్పందించి ఐసీయూను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఐసీయూ విభాగానికి
ప్రత్యేక సిబ్బంది కేటాయింపు
నేటి నుంచి అందుబాటులోకి
వైద్య సేవలు
సాక్షి కథనంతో అధికారులలో చలనం


