క్రికెట్‌ బుకీ అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ బుకీ అరెస్ట్‌

Jun 3 2026 1:03 AM | Updated on Jun 3 2026 1:03 AM

క్రికెట్‌ బుకీ అరెస్ట్‌

ట్రేడింగ్‌ పేరిట రూ.కోట్లలో మోసం

వివరాలు వెల్లడించిన సీఐ ప్రభాకర్‌

నరసరావుపేట టౌన్‌: క్రికెట్‌ బెట్టింగ్‌లు నిర్వహిస్తూ నకిలీ ట్రేడింగ్‌ కంపెనీ పేరిట మోసాలకు పాల్పడిన క్రికెట్‌ బుకీ గోల్డ్‌ శేఖర్‌ను అరెస్ట్‌ చేసినట్లు టూటౌన్‌ సీఐ సీహెచ్‌ ప్రభాకర్‌ తెలిపారు. మంగళవారం స్టేషన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. పట్టణానికి చెందిన కందుకూరి వీరశేఖరాచారి ఉరఫ్‌ గోల్డ్‌ శేఖర్‌ కొన్నేళ్లుగా క్రికెట్‌ బెట్టింగ్‌లు నిర్వహిస్తూ ట్రేడింగ్‌ కంపెనీ పేరిట అమాయక ప్రజలను మోసగిస్తున్నాడు. ఈ క్రమంలో విజయవాడకు చెందిన కల్యాణ చక్రవర్తిని ట్రేడింగ్‌ పేరుతో నమ్మించి రూ.1.44 కోట్లు తీసుకున్నాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో గోల్డ్‌ శేఖర్‌తో పాటు సావాని రవితేజ, మౌర్యవర్థన్‌రెడ్డి, సావాని లలితలపై చీటింగ్‌ కేసు నమోదు చేశారు. ఇప్పటికే కేసులో రవితేజ, లలిత దంపతులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న గోల్డ్‌ శేఖర్‌, అతని భార్య కందుకూరి వెంకట నాగ సులోచనలను మహానంది లోని లాడ్జిలో తలదాచుకున్నట్లు తెలుసుకొని అక్కడకు వెళ్లి సోమవారం రాత్రి అరెస్ట్‌ చేశారు. గోల్డ్‌ శేఖర్‌పై ఇప్పటి వరకు 12 క్రికెట్‌ బెట్టింగ్‌, రెండు గంజాయి, ఒక పోక్సో కేసులు నమోదై ఉన్నాయి. తాజాగా దర్శి పోలీసులు క్రికెట్‌ బెట్టింగ్‌ కేసుకు సంబంధించి అరెస్ట్‌ చేయగా బెయిల్‌పై విడుదల అయ్యాడు. ఇటీవల కడపలో మరో బెట్టింగ్‌కు సంబంధించి కేసు నమోదై ఉంది. కాగా కేసులో పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులు మౌర్యవర్థన్‌రెడ్డి, ఇస్లాంపేటకు చెందిన షేక్‌ నాగూర్‌లను అరెస్ట్‌ చేయాల్సి ఉందని సీఐ తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు సౌందర్‌ రాజన్‌, యాష్న, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement