సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కృష్ణయ్య
నరసరావుపేట: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కోసం రూ.24,700 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించి గెజిట్ విడుదల చేశారని, అమరావతికి 50 కిలోమీటర్ల దూరంలో 250 మీటర్ల వెడల్పు 129 కిలోమీటర్ల పొడవైన ఔటర్ రింగ్ రోడ్డు, 59 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్‌రోడ్డు దీనికి అనుబంధంగా 32 రేడియల్ లింక్ రోడ్ల నిర్మాణానికి 300 గ్రామాల్లో 15 వేల ఎకరాల అసంబద్ద భూసేకరణ ఎవరి ప్రయోజనాల కోసమో చెప్పాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు వి.కృష్ణయ్య ప్రశ్నించారు. స్థానిక కోటప్పకొండ రోడ్డులోని సీపీఎం కార్యాలయంలో గురువారం జిల్లా కమిటీ సమావేశం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి.రవిబాబు అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో కృష్ణయ్య మాట్లాడుతూ.. అసంబద్ధ భూసేకరణ వల్ల అమరావతిలో కొన్ని గ్రామాలు పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొందన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్న రేటు క్వింటా రూ.2400లు ప్రకటించి కొనుగోలు కేంద్రాలు తెరవకుండా రైతులను మోసం చేయడం తగదన్నారు. రాష్ట్రంలో 9.50 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు కాగా పల్నాడు జిల్లాలో 1.50 లక్షల ఎకరాలు సాగు చేశారన్నారు. పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ్‌కుమార్ మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరిచి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై.రాధాకృష్ణ, అనుముల లక్ష్మీశ్వరరెడ్డి, ఎస్.ఆంజనేయులు నాయక్, జిల్లా కమిటీ సభ్యులు గద్దె చలమయ్య, డి.శివకుమారి, జి.మల్లేశ్వరి, జె.శంకరరావు, పేరుబోయిన వెంకటేశ్వర్లు, గుంటుపల్లి బాలకృష్ణ పాల్గొన్నారు.


