సర్కారు భూముల ఆక్రమణపై చర్యలు శూన్యం | - | Sakshi
Sakshi News home page

సర్కారు భూముల ఆక్రమణపై చర్యలు శూన్యం

Mar 1 2026 7:54 AM | Updated on Mar 1 2026 7:54 AM

సర్కారు భూముల ఆక్రమణపై చర్యలు శూన్యం

సర్కారు భూముల ఆక్రమణపై చర్యలు శూన్యం

● గ్రామాల్లో ఎక్కడ చూసినా మద్యం దుకాణాలే ● మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ధ్వజం

వినుకొండ: వినుకొండలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకునే నాథుడే లేడని, ఎక్కడ చూసినా అక్రమ మద్యం షాపులు ఏర్పాటు చేస్తున్నా సమాధానం చెప్పేవాళ్లు లేరని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మండిపడ్డారు. స్థానిక వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సురేష్‌ మహల్‌ రోడ్డులో ఏకంగా తహసీల్దార్‌ కార్యాలయ గోడనే కూల్చివేసి రాత్రికి రాత్రే అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. హనుమాన్‌నగర్‌లో పాఠశాల సమీపంలోనే బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ ఏర్పాటు చేశారని, మహిళలు అడ్డుకున్నా షాపు నడుపుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అభివృద్ధి చేయకపోగా, అక్రమాలను కూడా అడ్డుకోలేని స్థితిలో ఉన్నారని దుయ్యబట్టారు. జీవీ ట్యాక్స్‌ పేరుతో గ్రానైట్‌ లారీల యజమానుల నుంచి రూ. లక్షలు వసూళ్లు చేస్తున్నారన్నారు.

అక్రమ తవ్వకాలు, రేషన్‌ బియ్యం వ్యాపారం, అంతటా మద్యం దుకాణాలు, ఇసుక అక్రమ తరలింపు వంటి కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు, దాడులు చేయడం వంటివి సర్వసాధారణంగా మారాయని అన్నారు. జీడీసీసీ బ్యాంక్‌ చైర్మన్‌ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు చేపల చెరువులను ఆక్రమించుకొని వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. ఎన్‌ఎస్‌పీ భూముల్లో గతంలో చేపట్టిన మాదిరిగానే షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించాలని సూచించారు. కొండపైన అభివృద్ధి పనులు ఎవరు చేశారో ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. గిరి ప్రదక్షిణ రోడ్డు గతంలో ప్లాన్‌ మాదిరిగా యథావిధిగా నిర్మించాలన్నారు.

వైఎస్సార్‌సీపీ హయాంలోనే గ్రామాలకు రోడ్లు

ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావులు సొంత గ్రామాలకు కూడా రోడ్లు వేసుకోలేని దుస్థితిలో గత ప్రభుత్వం హయాంలో తాము రోడ్లు వేశామని బ్రహ్మనాయుడు చెప్పారు. గతంలో వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మాణానికి అన్ని అనుమతులు మంజూరయ్యాయని ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు చెప్పారని గుర్తుచేశారు. బనకచర్ల పేరుతో ఒకరు, వరికపూడిశెల పేరుతో మరొకరు పనులు పూర్తి కానివ్వకుండా రైతులను, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. వినుకొండలో ట్రాఫిక్‌ అస్తవ్యస్తంగా తయారైందని, పట్టించుకునే వారే లేరని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అమ్మిరెడ్డి అంజిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఎంఎన్‌ ప్రసాద్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌లు బేతం గాబ్రియేలు, తెల్లాకుల రాజేష్‌ఖన్నా, పట్టణ అధ్యక్షులు కొత్తమాసు శివ, రూరల్‌ మండల అధ్యక్షులు దండు చెన్నయ్య, బీసీ సెల్‌ అధ్యక్షులు గుంజి వాసు, నూజెండ్ల మండల కన్వీనర్‌ ముప్పరాజు వెంకటేశ్వర్లు, టౌన్‌ మహిళా కన్వీనర్‌ సీహెచ్‌ దుర్గ తదితరులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement