మహిళా ఖోఖో పోటీలు ప్రారంభం
● పోటీలను ప్రారంభించిన
ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు
● పోటీలో పాల్గొంటున్న 13 జట్లు
నరసరావుపేట ఈస్ట్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల మహిళా ఖోఖో పోటీలు శుక్రవారం వాగ్దేవి డిగ్రీ కళాశాల మైదానంలో ప్రారంభమయ్యాయి. రెండురోజులపాటు నిర్వహించనున్న పోటీలలో వర్సిటీ ఖోఖో మహిళా జట్టును ఎంపిక చేయనున్నారు. పోటీలను ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ క్రీడల ద్వారా క్రమశిక్షణ, మానసిక శారీరక వికాసం కలుగుతుందని అన్నారు. క్రీడాకారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందించటంతోపాటు విద్యా, ఉద్యోగాలలో సముచిత రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు వివరించారు. కళాశాల ప్రిన్సిపల్ కపలవాయి రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో వర్సిటీ యోగా కోఆర్డినేటర్ డాక్టర్ డి.సూర్యనారాయణ, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి, ఖోఖో అసోసియేషన్ సలహాదారుడు డి.కోటేశ్వరరావు, ఒలంపిక్ అసోసియేషన్ కార్యదర్శి ఆదిరెడ్డి సత్యనారాయణ, కళాశాల చైర్మన్ కాట్ల రామకోటేశ్వరరావు, కార్యదర్శి రాయల శ్రీనివాసరావు, డైరెక్టర్ ఓగూరి నాగేశ్వరరావు, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ పి.రాజామెర్సిన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా పోటీలు..
నాకౌట్ కం లీగ్ పద్ధతిలో నిర్వహిస్తున్న టోర్నమెంట్‌లో 13 కళాశాలల మహిళా ఖోఖో జట్లు పాల్గొన్నాయి. ఏకపక్షంగా సాగిన తొలి మ్యాచ్‌లో బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల జట్టు 13–02 తేడాతో చేబ్రోలు హనుమయ్య ఫార్మసీ కళాశాల జట్టుపై ఘన విజయం సాధించింది. అలాగే గుంటూరు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జట్టు 24–10 తేడాతో తిరుమల ఆక్స్‌ఫర్డ్ మహిళా కళాశాలపై గెలుపొందింది. హోరాహోరీగా సాగిన మరో మ్యాచ్‌లో బాపట్ల మహిళా ఇంజనీరింగ్ కళాశాల జట్టు 14–13 తేడాతో ఏఎం రెడ్డి ఫార్మసీ కళాశాల (నరసరావుపేట) జట్టుపై విజయాన్ని నమోదు చేసుకుంది. కాగా 28వ తేదీ శనివారం లీగ్ దశ పోటీలు జరగనున్నట్టు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ మెర్సిన్‌బాబు తెలిపారు.


