బడ్జెట్‌లో చేనేత కార్మికులకు మొండిచెయ్యి
సత్తెనపల్లి: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో చేనేత రంగ కార్మికులకు మొండిచేయి చూపిందని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని ఫణిదం చేనేత సహకార సంఘం బిల్డింగ్ సమీపంలో మంగళవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం పల్నాడు జిల్లా కమిటీ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సమావేశానికి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టా శివదుర్గారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేనేత రంగానికి మాత్రం కేవలం రూ.200 కోట్లు కేటాయించటం దారుణమన్నారు. తాము అధికారంలోకి వస్తే సంవత్సరానికి రూ. 5 వేల కోట్లు కేటాయిస్తామని బీజేపీ నేతలు పార్లమెంటులో మాట్లాడారన్నారు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన 13 సంవత్సరాల కాలంలో రూ. 5,093.56 కోట్లు మాత్రమే కేటాయించి చేనేతను మరణశయ్యపైకి నెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టా శివ దుర్గారావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పవర్ లూమ్‌ను ప్రోత్సహిస్తూ చేనేతను దెబ్బతీస్తున్నాయన్నారు. రాష్ట్రంలో చేనేత సహకార సంఘాలకు ఇవ్వవలసిన పావలా వడ్డీ, యారన్ సబ్సిడీ, రిబేట్ కింద ఇవ్వవలసిన రూ. 23 కోట్లు వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా రూ.200 యూనిట్లు ఉచిత కరెంటు, చేనేత కార్మికులకు సంవత్సరానికి రూ. 25 వేలు స్కీం వెంటనే అమలు చేయాలని ఆయన కోరారు. ఏపీ రాష్ట్ర చేనేత సంఘాల కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 22న జరిగే చలో మంగళగిరి మహాగర్జనలో చేనేత కార్మికులు, చేనేత శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా చలో మంగళగిరి మహాగర్జన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి ఎ.వీరబ్రహ్మం, కమిటీ సభ్యులు పి.ప్రభాకర్ రావు, వి.చిన్నదిబ్బయ్య, మోపర్తి బాబు రాజు, జి.యేసు రత్నం, బిట్రా పానకాలు, గడ్డం సుస్సులోవ్, కట్ట రమాదేవిలు పాల్గొన్నారు.
ఏపీ చేనేత కార్మిక సంఘం
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ


