అంగన్‌వాడీలకు నిధులు కేటాయించకపోవడం దుర్మార్గం
సీఐటీయూ జిల్లా గౌరవ అధ్యక్షురాలు గుంటూరు మల్లేశ్వరి సత్తెనపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం ఎదుట బడ్జెట్ ప్రతుల దహనం
సత్తెనపల్లి: 2026–27 కేంద్ర బడ్జెట్‌లో అంగన్‌వాడీలకు వేతనాల పెంపు, స్కీం నిర్వహణకు సరిపోను బడ్జెట్ కేటాయించకపోవడం దుర్మార్గమని అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా గౌరవ అధ్యక్షురాలు గుంటూరు మల్లేశ్వరి అన్నారు. అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం సత్తెనపల్లిలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా గుంటూరు మల్లేశ్వరి మాట్లాడుతూ ఈనెల 12న అంగన్‌వాడీ కేంద్రాలు మూసేసి ప్రాజెక్ట్, మండల కేంద్రాల్లో భారీ ర్యాలీ నిరసనలు జరపాలని రాష్ట్ర కమిటీ పిలుపు నిచ్చిందన్నారు. 2026–27 కేంద్ర బడ్జెట్‌లో అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్‌తో సహా దాదాపు ఒక కోటి మంది స్కీం వర్కర్ల దుస్థితి, హక్కులపై మాట్లాడకపోవడాన్ని కమిటీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఐసీడీఎస్, ఇతర స్కీమ్ వర్కర్లకు ప్రాథమిక సేవల పథకాలలో మౌలిక సదుపాయాలు, సేవలు నాణ్యత పై బడ్జెట్ మౌనంగా ఉందన్నారు. కేటాయింపుల్లో ఎటువంటి పెరుగుదల లేదన్నారు. ప్రాజెక్టు గౌరవాధ్యక్షుడు పెండ్యాల మహేష్ మాట్లాడుతూ కార్మిక చట్టాల ద్వారా కార్మికులకు కనీస వేతనాలు అందిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కార్యకర్తలకు నెలకు కేవలం రూ. 2,700, అంగన్‌వాడీ సహాయకులకు నెలకు రూ.1,350 వేతనంగా చెల్లిస్తుంద న్నారు. 2018 నుండి సామాన్య ప్రజలకు ఆహారం, ఆరోగ్యం, విద్య వంటి ప్రాథమిక సేవలను అందించే ఈ గ్రాస్ రూట్ స్థాయి కార్మికుల వేతనంలో ఎటువంటి పెరుగుదల లేదన్నారు. సీఐటీయూ పట్టణ కన్వీనర్ ఎం.హరిపోతురాజు మాట్లాడారు. ముందుగా బడ్జెట్ ప్రతులు దగ్ధం చేసిన అనంతరం సీడీపీఓ టి.శ్రీలతకు వినతిపత్రం అందించారు. కార్య క్రమంలో అంగన్‌వాడీ ప్రాజెక్టు అధ్యక్షురాలు సుజాత, కార్యదర్శి అహల్య, సెక్టార్ లీడర్లు ప్రభావతి, ముంతాజ్, అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, ఉన్నారు.


