పీజీఆర్‌ఎస్ ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి
జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ 170 ఫిర్యాదులు స్వీకరణ
నగరంపాలెం: జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహించారు. ఈ మేరకు బాధితుల నుంచి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అర్జీలు స్వీకరించారు. బాధితుల సమస్యలను ఆయన ఆలకించారు. సంబంధిత సబ్ డివిజన్ల పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ మొబైల్‌ఫోన్‌లో మాట్లాడారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి పోలీస్‌స్టేషన్ అధికారి పీజీఆర్‌ఎస్ ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీలు పరిష్కరించాక బాధితులకు తెలియజేయాలని చెప్పారు. ఫిర్యాదిదారుల అనుమతుల్లేకుండా ఏ ఫిర్యాదు ఆన్‌లైన్‌లో మూసివేయద్దని సూచించారు. 170 ఫిర్యాదులు స్వీకరించామని తెలిపారు. జిల్లా ఏఎస్పీ (పరిపాలన) జీవీ.రమణమూర్తి, డీఎస్పీలు అబ్దుల్‌అజీజ్ (గుంటూరు తూర్పు), శ్రీనివాస్‌రెడ్డి (మహిళా పీఎస్), బెల్లం శ్రీనివాసరావు (ట్రాఫిక్)లు ఫిర్యాదులు స్వీకరించారు.
గుంటూరులో 1960లో శాంతి ఆర్ట్స్ పేరుతో ప్రింటింగ్ యూనిట్‌ను మా తండ్రి పీఎం జైన్ ప్రారంభించారు. వందలాది కుటుంబాలకు జీవనోపాధి కల్పించాం. 1987లో రెడ్డిపాలెంలో సొంత ఫ్యాక్టరీ నెలకొల్పాం. అనేక ఉత్తమ జాతీయ, అంతర్జాతీయ అవార్డులను స్వీకరించాం. కొన్ని పరిస్థితుల దృష్ట్యా విక్రయించాం. అయితే యాజమాని మళ్లీ మాకే అద్దెకిచ్చారు. 2017 వరకు అక్కడే వ్యాపారం నిర్విర్తించాం. ఆ తర్వాత ఓబులునాయుడుపాలెంకు వెళ్లాం. దీంతో రెడ్డిపాలెంలోని గౌడెన్‌ను వేరే వారికి అద్దెకిచ్చారు. అయితే వారు మా సంస్థ పేరుతో లావాదేవీలు నిర్వహిస్తున్నారు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితంలేదు. న్యాయం చేయగలరు. – విక్రమ్ జైన్, అరండల్‌పేట
సుమారు 14 ఏళ్ల క్రితం మా పెద్దమ్మాయికి పెళ్లయింది. ఏడాది లోపు అనారోగ్యంతో అల్లుడు మృతిచెందాడు. వారికి ఓ కుమారుడు ఉన్నాడు. అయితే గతేడాది ప్రైవేటు ఉద్యోగం నిమిత్తం నా కుమార్తె ఊరెళ్లింది. దీంతో మనవడు నా వద్దనే ఉంటున్నాడు. ఉద్యోగం నిమిత్తం వెళ్లిపోయిన కుమార్తె ఊర్లోనే ఉంటుందని తెలిసి, మనవడితో కలిసి అక్కడికెళ్లాం. అయితే ఆమె ఓ పెద్దాయన్ని పెళ్లి చేసుకుందని గుర్తించాం. ప్రస్తుతం మనవడు పెదనందిపాడులో చదుతున్నాడు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. ఇటీవల నా మనవడు వాళ్ల అమ్మ వద్దకెళ్లినా పట్టించుకోలేదు. ప్రతి రోజు తల్లి కావాలని అడుగుతున్నాడు. వాడిని ఏమని సముదాయించను.. పోలీసులు జోక్యం చేసుకుని, నా మనవడు తల్లితో కలిసి ఉండేలా ఏర్పాటు చేయగలరు.
– వృద్ధురాలు, వరగాని, పెదనందిపాడు


