కరుణ చూపే కానుకమాత
రెంటచింతల: ప్రేమను వర్షించే ఆధ్యాత్మిక కేంద్రం కానుకమాత దేవాలయం. ఆలయంలో అడుగు పెట్టగానే చలువరాయి చల్లదనమే కాదు...కానుకమాత కరుణా కటాక్షాల వీక్షణాలు కూడా ప్రసరిస్తాయి. క్రీస్తు శిలువ వేసే సమయంలో పడిన పాట్లను గుర్తుచేసే 14 స్థలాలు ఇక్కడ భక్తులలో ప్రేమ, శాంతి, కరుణ, సహనం నింపుతాయి. రాష్ట్రంలోనే దాదాపు 5వేల మంది భక్తులు ఒకేసారి ప్రార్థన చేసుకునే సౌకర్యం ఉన్న అతిపెద్ద చలువరాతి క్రీస్తు దేవాలయం 1982 సంవత్సరంలో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించారు. ఇంతపెద్ద ఆలయం కేవలం రెండు ఫిల్లర్ల ఆధారంగా నిర్మించడం మరో విశేషం. ఈ దేవాలయాన్ని 2025 సంవత్సరంలో కోట్లాది రూపాయల వ్యయంతో ఎంతో అద్భుతంగా విచారణ గురవులు గ్రామ సంఘస్తుల సహకారంతో పున:నిర్మాణం చేపట్టారు.
కనుల పండువగా తిరునాళ్లు
రెంటచింతల గ్రామంలో పలు సామాజిక వర్గాలకు చెందిన సుమారు 1200కి పైగా కుటుంబాలు క్రైస్తవ్యాన్ని విశ్వసిస్తున్నాయి. ఆలయంలో ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక ప్రార్థనలు చేస్తుండటంతో ఈ ప్రాంతంలో ఎప్పుడు ఆధ్యాత్మిక భావన తొణికసలాడుతూ ఉంటుంది. ఫాదర్ జోసఫ్ గ్రాండ్ నుంచి ఫాదర్ ఏరువ లూర్ధు మర్రెడ్డి వరకు 19 మంది విచారణ గురువులు ఇక్కడ క్రీస్తు బోధనలు చేస్తూ సేవలను అందిస్తున్నారు. ప్రతి ఏటా కానుకమాత దేవాలయంలో జనవరి 24న జెండా ప్రతిష్టతో ప్రారంభమై ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు నవదిన ప్రార్థనలు జరుగుతాయి. ఫిబ్రవరి 2న కానుకమాత తిరునాళ్ల మహోత్సవం కనుల పండుగగా జరుగుతుంది. వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న గ్రామానికి చెందిన వారితోపాటు వారి బంధుమిత్రులు ఈ తిరునాళ్ల మహోత్సవంలో పాల్గొంటారు.
నేటి కార్యక్రమాలు
మంగళవారం ఉదయం 5 గంటలకు విచారణ గురువులు ఏరువ లూర్ధు మర్రెడ్డి, సహాయ గురువులు ప్రసన్నకుమార్ మొదటి దివ్యపూజాబలి, ఉదయం 9.30 గంటలకు నల్గొండ మేత్రాసన పీఠాధిపతులు, అభిషిక్త గురువులు మహా ఘన డాక్టర్ కరణం దమన్‌కుమార్‌చే పండుగ పవిత్ర సమష్టి మహోత్సవ దివ్యపూజాబలి నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 4 గంటల నుంచి అన్నీ మతస్తులవారు కానుక మాత, యేసుక్రీస్తు దీవెనలు పొంది కొవ్వొత్తులు సమర్పించి తమ జీవితాలలోను కొత్త వెలుగును నింపాలని మనసారా ప్రార్థిస్తారు. కోలాట ప్రదర్శన ఉంటుంది.
ఏర్పాట్లు పూర్తి...
కానుకమాత చర్చి తిరునాళ్ల మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని విచారణ గురువులు రె.ఫాదర్ ఏరువ లూర్ధు మర్రెడ్డి తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలలోని వివిధ జిల్లాల నుంచి క్రైస్తవ గురువులు, మఠకన్యలు ఆదివారం సాయంత్రానికి ఇక్కడకు చేరుకుంటారు.
నేడు కానుకమాత దేవాలయ తిరునాళ్ల
రాష్ట్రంలోనే అతి పెద్ద చర్చి
కరుణ చూపే కానుకమాత


