‘బార్’లకు స్పందన నామమాత్రం
‘బార్’లకు స్పందన నామమాత్రం ● కూటమి నేతల కనుసన్నల్లో మద్యం వ్యాపారాలు చేయాల్సి ఉండటంతో ఇతర వ్యాపారులెవరూ ముందుకు రావడం లేదు. దీంతో అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 54 బార్లకు కాను కేవలం 22 దరఖాస్తులు మాత్రమే మంగళవారం గడువు ముగిసే సమయానికి నమోదయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇందులో మూడు బార్ అండ్ రెస్టారెంట్లకు నాలుగు చొప్పున దరఖాస్తులు, పది బార్‌లకు ఒక్కోటి చొప్పున దరఖాస్తులు నమోదయ్యాయి. సత్తెనపల్లిలో ఉన్న 5 బార్లలో రెండింటికి నాలుగేసి చొప్పున, రెండింటికి ఒక్కొక్కటి చొప్పున దరఖాస్తులు రాగా, ఒక బార్‌కు దరఖాస్తులు దాఖలు కాలేదు. నరసరావుపేటలో 18 బార్ అండ్ రెస్టారెంట్లు ఉండగా కేవలం నాలుగు బార్ అండ్ రెస్టారెంట్లకు ఒక్కొక్కటి చొప్పున మాత్రమే అందాయి. చిలకలూరిపేట, వినుకొండ, మాచర్ల, పిడుగురాళ్లలలో బార్ అండ్ రెస్టారెంట్లకు ఒక్క దరఖాస్తు కూడా నమోదు కాకపోవడం గమనార్హం.
దరఖాస్తుల గడువు పొడిగింపు 54 బార్లకు గాను దాఖలైంది 22 దరఖాస్తులే.. చిలకలూరిపేట, వినుకొండ, మాచర్ల, పిడుగురాళ్లలో స్పందన శూన్యం
నరసరావుపేట టౌన్: కూటమి ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన బార్ అండ్ రెస్టారెంట్ల దరఖాస్తు గడువును పొడిగించింది. తొలుత ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మంగళవారంతో గడువు ముగియాల్సి ఉండగా ఆశించిన మేర స్పందన రాకపోవడంతో ఈ నెల 29వరకు పెంచారు. జిల్లాలో ఉన్న 49 సాధారణ, 5 గీత కులాలకు సంబంధించిన బార్లకు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.. దరఖాస్తు ఫీజు రూ.5లక్షలు, ఒక్కో బార్‌కు కనీసం నాలుగు దరఖాస్తులు దాఖలు చేస్తేనే లాటరీ ప్రక్రియ కొనసాగేలా ప్రభుత్వం నిబంధన పెట్టింది. ఈ లెక్కన 54 బార్లకు 216 దరఖాస్తులు పైబడి రావాల్సి ఉంది.