
జాబ్‌మేళాలో 117 మందికి ఉద్యోగాలు
నరసరావుపేట ఈస్ట్: జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎన్‌ఏసీ శిక్షణా కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్‌మేళాలో 117 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికై నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఇ.తమ్మాజీరావు తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయ సమీపంలోని ఎన్‌ఏసీ కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన జాబ్‌మేళాకు 273 మంది నిరుద్యోగులు హాజరు కాగా 10 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులైన 117 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసుకున్నట్టు వివరించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు నైపుణ్యాభివృద్ధి సంస్థ కృషి చేస్తున్నట్టు తెలిపారు. యువత నైపుణ్యాలను పెంపొందించుకోవాలని హితవు పలికారు. తమ సంస్థ నైపుణ్యాలను పెంపొందించటంతో పాటు జాబ్‌మేళాలు నిర్వహించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని స్పష్టం చేశారు. ఎన్‌ఏసీ శిక్షణా కేంద్రం ఇన్‌ఛార్జ్ మేరీ జోత్స్న, జిల్లా ఉద్యోగ కల్పన అధికారి ఎం.రవీంద్రనాయక్, స్కిల్ హబ్ కో–ఆర్డినేటర్ ఎం.వీరాంజనేయులు, ఎ.రమ్య, వివిధ కంపెనీల హెచ్‌ఆర్ ప్రతినిధులు పాల్గొన్నారు.
కొల్లూరు: చెరువులో పడి గల్లంతైన యువకుడి మృతదేహాన్ని గజ ఈతగాళ్ల సాయంతో పోలీసులు వెలికి తీయించారు. సోమవారం రాత్రి కొల్లూరు శివారు బోస్‌నగర్‌లో సభావత్తు గోపినాయక్ (34) గ్రామాన్ని అనుకొని ఉన్న చెరువులో పడి గల్లంతైన విషయం విదితమే. అతని పెద్దమ్మ ఇంటికి వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో చెరువులో పడిన వ్యక్తిని గమనించిన మహిళ స్థానికులను అప్రమత్తం చేసింది. స్థానికులు అతని కోసం గాలించినా ప్రయోజనం లేకపోవడంతో కొల్లూరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సోమవారం రాత్రి గజ ఈతగాళ్లను చెరువులోకి దింపి గల్లంతైన యువకుడి కోసం గాలించారు. అర్ధరాత్రి సమయంలో మృతదేహం లభ్యమైంది. మృతుడి తల్లి దుర్గమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు ఎస్‌ఐ జానకి అమరవర్ధన్ తెలిపారు.

జాబ్‌మేళాలో 117 మందికి ఉద్యోగాలు