
మౌలిక వసతుల కల్పనకు కృషి
జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు బెల్లంకొండ మండలం రామాంజనేపురంలో పర్యటన
బెల్లంకొండ: మండలంలోని మన్నెసుల్తాన్‌పాలెం పంచాయతీ పరిధిలో గల రామాంజనేయపురం గ్రామంలో వెంటనే మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు తెలిపారు. మంగళవారం రామాంజనేయపురం గ్రామంలో ఆయన పర్యటించారు. ముందుగా గ్రామంలో నిర్మాణం పూర్తయి ప్రారంభానికి నోచుకోని ప్రాథమిక పాఠశాలలను పరిశీలించారు. ఎన్నో ఏళ్లుగా గ్రామంలో పాఠశాల కోసం ఎదురు చూస్తున్నామని, గత ప్రభుత్వ హయాంలో పాఠశాల భవనాన్ని నిర్మించారని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కానీ ఇంతవరకు పాఠశాలలో సిబ్బందిని ఏర్పాటు చేసి విద్యా బోధన చేపట్టలేదని తెలిపారు. పాఠశాలకు యూడైస్ కోడ్ రాని కారణంగా ఉపాధ్యాయుల నియామకానికి, మధ్యాహ్న భోజన పథకానికి పలు ఇబ్బందులు ఉన్నాయని డీఈఓ కలెక్టర్‌కు వివరించారు. వారం రోజుల్లో పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులను నియమించి, విద్యాబోధన చేపట్టాలని కలెక్టర్ డీఈఓకు ఆదేశించారు.
– అనంతరం గ్రామంలోని ప్రధాన కూడలిలో అధికారులు, గ్రామస్తులతో సమావేశం నిర్వహించి, సమస్యలు తెలుసుకున్నారు. తాము నివసించే ఇళ్లకు పట్టాలు లేవని, ఒక్క వీధికి కూడా సిమెంట్ రోడ్లు లేవని గ్రామస్తులు వాపోయారు. అటవీ ప్రాంతంలో ఉండడంతో మంచినీటి బోరు వేసుకోవాలన్న అటవీ అధికారులు అడ్డుకుంటున్నారని తెలిపారు. రేషన్ బియ్యం తెచ్చుకోవాలన్నా పక్క గ్రామమైన మన్నెసుల్తాన్ పాలెంకు వెళ్తున్నామని బాధలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అటవీ అధికారులతో సమీక్ష ఏర్పాటు చేసి రామాంజనేయ పురాన్ని గ్రామకంఠంగా విభజిస్తామని, ఇళ్ల పట్టాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. గ్రామంలో సీసీ రోడ్లు నిర్మించే విధంగా అధికారులకు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రమణకాంత్ రెడ్డి, డీఈఓ చంద్రకళ, డీఎంహెచ్‌ఓ రవి, అటవీశాఖ రేంజ్ అధికారి విజయకుమారి, తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, ఎంఈఓ బాలసుందరరావు, ఇంచార్జ్ ఎంపీడీఓ శ్రీనివాస్ నాయక్, ఏపీడీ నారాయణ ఉన్నారు.
తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీలు..
రాజుపాలెం: మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. శిథిలావస్థకు చేరిన కార్యాలయంలో భయంతో విధులు నిర్వహిస్తున్నామని తహసీల్దార్ సరోజ కలెక్టర్‌కు వివరించారు. వెంటనే స్పందించిన కలెక్టర్ ఏదైనా ప్రభుత్వ కార్యాలయం ఖాళీగా ఉంటే తన దృష్టికి తేవాలని, మీకు అనుకూలంగా ఉంటే ఆ కార్యాలయంలోకి మారుస్తామని తెలిపారు. ఆయన వెంట సత్తెనపల్లి ఆర్డీఓ రమాకాంత్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ జానీబాషా, ఆర్‌ఐ గోపి తదితరులు ఉన్నారు.