
మోసపోయాం.. ఆదుకోండి
నరసరావుపేట టౌన్: నమ్మి మోసపోయాం.. నిందితులను అరెస్ట్ చేసి పోలీసులు చేతులు దులుపుకొన్నారు. నిందితులు దోచుకున్న సొమ్ముతో కొన్న ఆస్తులతో పాటు దారిమళ్లించిన సొత్తును పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకోలేదు. తమకు ఎలాగైనా న్యాయం జరిగేలా చూడాలని యానిమేషన్ స్కాంలో మోసపోయిన బాధితులు సోమవారం నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును కలిసి విన్నవించారు. విజయవాడ కేంద్రంగా యూపిక్స్ క్రియేషన్స్ పేరిట యానిమేషన్ కంపెనీను ఏర్పాటు చేసి అందులో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి రూ.కోట్లు వసూళ్లు చేసి చివరకు బోర్డు తిప్పేసిన సంగతి తెలిసిందే. నష్టపోయిన బాధితుల్లో అధిక శాతం నరసరావుపేట వాసులే. అరెస్ట్ అయిన నిందితుడు మిట్టపల్లి రాజేంద్రప్రసాద్ అలియాస్ రాజుకు నరసరావుపేటలో బంధుత్వం ఉన్న కారణంగా ఎక్కువమంది యానిమేషన్ మాయకు ఆకర్షితులై మోసపోయారు. బాధితులంతా ఎంపీని కలిసి నిందితులను అరెస్ట్ చేసిన సమయంలో నామమాత్రంగా రికవరీ చేశారని, పూర్తిస్థాయిలో ఆస్తులను గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకొని నష్టపోయిన వారందరికీ న్యాయం జరిగేలా చూడాలని కోరారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని ఎంపీ వారికి హామీ ఇచ్చారు. ఎంపీని కలిసిన వారిలో ఆతుకూరి అమర లింగేశ్వరరావు, పచ్చిపులుసు వెంకటేష్, గుండా అనిల్, గుండా హనుమంతరావు, మిట్టపల్లి హర్ష, పెరుమళ్ల రవి, కొప్పరావూరి ఆంజనేయులు తదితరులు ఉన్నారు.
ఎంపీ లావుతో ‘యానిమేషన్’ బాధితులు