
సంక్షేమ వసతి గృహ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
సత్తెనపల్లి: సంక్షేమ వసతి గృహ విద్యార్థి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మంగళవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి... అచ్చంపేట మండలం అంబటిపూడి గ్రామానికి చెందిన తాళ్లూరి సూర్య జంగంగుంట్లపాలెంలోని కేసీ రెడ్డి కళాశాలలో బీ ఫార్మసీ తృతీయ సంవత్సరం విద్యనభ్యశిస్తూ సత్తెనపల్లి రైల్వే గేట్ సమీపంలోని ఎస్సీ కళాశాల బాలుర వసతి గృహంలో ఉంటున్నాడు. ఈ నెల 22న సాయంత్రం వసతి గృహం నుంచి ఇంటికి వెళ్లి మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు తిరిగి హాస్టల్‌కు చేరుకున్నాడు. హాస్టల్‌లో బ్యాగ్ సర్దుకొని ఇంటికని చెప్పి బయటకు వెళ్లి తిరిగి 3.30 గంటలకు మళ్లీ హాస్టల్లోకి వచ్చాడు. వెంటనే గది లోకి వెళ్లి 10 నిమిషాలు పాటు ఉన్న సూర్య బయటకు వచ్చి వసతిగృహంలో పనిచేసే కుక్ శ్యాంబాబుతో తనకు కళ్లు తిరుగుతున్నాయని, హాస్పటల్‌కు తీసుకు వెళ్లమని కోరాడు. కుక్ శ్యాంబాబు సరేనని దగ్గరకు రాగా పురుగుమందు వాసన వస్తుండడంతో ఏం జరిగిందో చెప్పమని సూర్యను ప్రశ్నించాడు. తాను ఆత్మహత్య చేసుకునేందుకు గడ్డి మందు తాగానని చెప్పాడు. వెంటనే కుక్ శ్యాంబాబు సంక్షేమ వసతి గృహ అధికారి పాపయ్యకు సమాచారం అందించి, సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా వైద్యులు తాగిన మందును కక్కించి ప్రాథమిక వైద్యం అందించి మెరుగైన వైద్యానికి గుంటూరు సిఫార్సు చేశారు. దీంతో సంక్షేమ వసతి గృహ అధికారి పాపయ్య విద్యార్థి తల్లిదండ్రులైన అశోక్, సుజాతకు సమాచారం అందించాడు. హుటాహుటిన గుంటూరు జీజీహెచ్‌కు తరలించగా ప్రస్తుతం వైద్యశాలలో డయాలసిస్ వైద్యసేవలు అందిస్తున్నారు. ప్రేమ వ్యవహారంలో భాగంగా చదువు కోవటం కష్టంగా ఉందంటూ విద్యార్థి సూర్య వాపోయినట్లు సమాచారం. ఈ ఘటన సంక్షేమ కళాశాల వసతి గృహంలో కలకలం రేపింది. చేతికి వచ్చిన కుమారుడు ఆత్మహత్యకు యత్నించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.