
అమరావతిలో సూపర్‌వైజరీ కమిటీ పరిశీలన
తాడికొండ: రాజధాని అమరావతిలో కేంద్ర పర్యావరణం, అటవీ– వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ అడిషనల్ సెక్రటరీ అమన్‌దీప్ గార్గ్ తదితరులు గురువారం పర్యటించారు. తొలుత ఉండవల్లిలోని రివర్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్, కొండవీటి వాగు వరద పంపింగ్ స్టేషనును పరిశీలించారు. సీఆర్డీఏ కమిషనర్ కె.కన్నబాబు, అదనపు కమిషనర్ జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్‌లు ఇక్కడి ఏర్పాట్లను ఆయనకు వివరించారు. సీఆర్డీఏ, అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీఎల్) ఆధ్వర్యంలో అమరావతిలో వరద నిర్వహణ చర్యల నిమిత్తం ప్రస్తుతం అమలవుతున్న, భవిష్యత్తులో చేపట్టనున్న కార్యకలాపాలు, ప్రణాళికలపై సూపర్‌వైజరీ కమిటీ తరఫున విచ్చేసిన అమన్‌దీప్ గార్గ్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు వారు తెలిపారు. అనంతరం అమరావతి సీడ్ యాక్సిస్ రహదారి సమీపంలోని ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం, గ్రీనరీ, ఎల్పీఎస్ జోన్ల అభివృద్ధి పనుల వివరాలను సీఆర్డీఏ కమిషనర్ వివరించారు. అనంతరం అధికారులతో కలసి అమన్‌దీప్ గార్గ్ అమరావతిలోని టిడ్కో గృహ సముదాయాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అధికారుల కోసం నిర్మించిన భవనాల సముదాయాలను సందర్శించారు. నిర్మాణాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలోని ట్రాన్స్‌లొకేటెడ్ నర్సరీని అమన్‌దీప్ గార్గ్ సందర్శించారు. అనంతరం అమరావతి సచివాలయంలో సూపర్‌వైజరీ కమిటీతో సీఆర్డీఏ, ఏడీసీఎల్ అధికారులు సమావేశమయ్యారు. కమిటీ సభ్యులలోని మరొక ముగ్గురు అధికారులు ఆన్‌లైన్ ద్వారా ఈ సమావేశానికి హాజరు అయ్యారు. రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న భవనాల పనులలో పురోగతి, రాజధాని ప్రాంత నివాసితులకు అమలవుతున్న సామాజిక సంక్షేమ కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ, విపత్తు నిర్వహణకు చేపట్టిన కార్యకలాపాలు, కార్మికులు, మహిళల భద్రతకు అమలవుతున్న చర్యల గురించి సీఆర్డీఏ అధికారులు వారికి వివరించారు. సమావేశంలో ఏడీసీఎల్ సీఎండీ లక్ష్మీ పార్థసారథి, వివిధ విభాగాల ముఖ్య అధికారులు పాల్గొన్నారు.