
కబడ్డీ పోటీల్లో ఈపూరు విద్యుత్ సిబ్బంది సత్తా
ఈపూరు(శావల్యాపురం): రాష్ట్రస్థాయిలో జరిగిన కబడ్డీ పోటీల్లో ఈపూరు మండల విద్యుత్ సిబ్బంది పల్నాడు జిల్లా టీం తరఫున ప్రథమ బహుమతి సాధించడం అభినందనీయమని నరసరావుపేట ఎస్‌ఈ ప్రత్తిపాటి విజయ్‌కుమార్ తెలిపారు. కార్యాలయంలో గురువారం పోటీల్లోని విజేతలు పిన్నిబోయిన వెంకటేశ్వరరావు, కంచర్ల ఏడుకొండలు, సన్నిబోయిన రామాంజినేయులు, అచ్యుత్, మల్లికార్జున్‌లను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ అంకితభావంతో విధుల నిర్వహణతో పాటు క్రీడల్లోనూ రాణించటం ప్రశంసనీయమని తెలిపారు. మానసిక వికాసం, శారీరక దృఢత్వానికి క్రీడలు దోహదపడతాయని పేర్కొన్నారు. జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు పిన్నబోయిన వెంకటేశ్వరరావు ఎంపిక కావడంతో ఆయన్ను ప్రత్యేకంగా అభినందించారు. విజేతలకు క్రీడా దుస్తులు అందజేశారు. కార్యక్రమంలో డీఈ రాంబొట్ల, ఏడీఏ భవనం వెంకటేశ్వరరెడ్డి, ఏఈ సంపెంగుల గాంధీ ఉన్నారు.