
చోర్.. పల్నాడు బేజార్ !
జిల్లాలో వరుస చోరీలు చోద్యం చూస్తున్న పోలీసులు తాజాగా వినుకొండలో పట్టపగలు మహిళలను హత్య చేసి బంగారం చోరీ గతంలో ఇక్కడే ఇద్దరు మహిళలను చంపిన దొంగలు గురజాల, దాచేపల్లి, చిలకలకూరిపేట సర్కిల్ పరిధిలో నిత్యం దొంగతనాలు సాయంత్రం జిల్లాలోకి వచ్చి దొంగతనాలు తెల్లారి రైలెక్కి వెళ్లిపోతున్న ఉత్తర భారత్ ముఠాలు ప్రత్యర్థులపై రెడ్‌బుక్ రాజ్యాంగం అమలులో ఖాకీలు బిజీ
భారీగా దొంగతనాలతో ప్రజలు బెంబేలు
పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే ఏకంగా 268 దొంగతనాలు జరిగాయి.
ఇందులో 28 దొంగతనాలు పగటి పూట, 52 దొంగతనాలు రాత్రి పూట జరిగాయి.
187 సాధారణ చోరీలు, ఒక మహిళలను హత్యచేసి చోరీకి పాల్పడ్డారు.
268 దొంగతనాల్లో రూ.3.11 కోట్ల సొత్తు చోరీ జరగగా, అందులో పోలీసులు రూ.1.28 కోట్లను రివకరీ చేశారు.
ఇది దొంగతనాలు జరిగిన దాంట్లో 41.30 శాతానికి సమానం.
దొంగతనాలు అధికంగా చిలకలూరిపేట టౌన్‌లో 25, నరసరావుపేట వన్‌టౌన్, మాచర్లలో 18 చొప్పున, సత్తెనపల్లి టౌన్‌లో 17 జరిగాయి.
తొలి ఆరు నెలల్లో 268 దొంగతనాలు
పోలీసుల నిర్లిప్తత
సాక్షి, నరసరావుపేట: పల్నాడులో దొంగలు చెలరేగిపోయి పోలీసులకు సవాల్ విసురుతున్నారు. నిత్యం ఏదో ఒకచోట దొంగతనాలు చేస్తూ, ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. దొంగతనాలు చేసే క్రమంలో పాశవికంగా ప్రాణాలు కూడా తీస్తున్నారు. ముఖ్యంగా ఒంటరిగా ఉన్న మహిళలే టార్గెట్‌గా చేసుకుని హత్యలు, చోరీలు చేయడం ఆందోళనకరంగా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వినుకొండ పట్టణ పరిఽధిలో ఏకంగా ముగ్గురు మహిళలను హత్య చేసి దొంగలు చోరీలకు పాల్పడ్డారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా గురువారం వినుకొండ పట్టణంలో ఒంటిమీద బంగారం కోసం మహిళను హత్య చేసినట్టు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణ కొచ్చారు. కళ్యాణపురి కాలనీలో ఉదయం ఆలపాటి పుష్పలత(39) ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి, ఆమెను చంపాడు. ఒంటిపై ఉన్న బంగారపు అభరణాలు తీసుకెళ్లినట్టు మృతురాలి భర్త తెలుపుతున్నాడు. పట్టణంలో గతేడాది జూన్ 19న కోటిరత్నం(75) , ఈ ఏడాది మార్చి 17న కొప్పరపు సావిత్రి(69)లను హత్య చేసి, దొంగతనాలకు పాల్పడ్డారు. దాదాపుగా అదే తరహాలో వినుకొండలో మూడో హత్య జరగడం ఆందోళన కలిగిస్తోంది.
గురజాల సబ్ డివిజన్‌లో వరుస చోరీలు
గురజాల సబ్ డివిజన్ పరిధిలో ఈ ఏడాది జనవరిలో వరుస దొంగతనాలతో దొంగలు హడల్ పుట్టించారు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లినవారే లక్ష్యంగా గురజాల పట్టణంలో మూడు, పులిపాడు గ్రామంలో ఆరు, నడికుడి, శ్రీనివాసపురం గ్రామాల్లోని పలు ఇళ్లలో చోరీలు చేశారు. సీసీ కెమెరాలను పగలగొట్టి మరీ ఇళ్లలో విలువైన వస్తువులను దోచుకెళ్లారు. ఇలా గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల , రెంటచింతలలో వరుస దొంగతనాలు చేశారు. ఈ దొంగతనాలు ఒకే ముఠా చేశాయని, నార్త్ ఇండియాకు చెందిన ఈ దొంగలు సాయంత్రం రైళ్లలో దిగి రాత్రిపూటి దొంగతనాలు చేసి, తెల్లవారుజామున తిరిగి వెళ్లిపోతారని విచారణలో పాల్గొన్న పోలీసులు తెలుపుతున్నారు. ఈ ముఠాలను అరికట్టడంలో వారు విఫలమయ్యారన్న విమర్శలున్నాయి.
గ్రామాల్లో రెక్కీ
పల్నాడు జిల్లాలో కీలకమైన రైల్వేలైన్ అయిన గుంటూరు–బీబీనగర్ లైన్‌లో ముఖ్యంగా పిడుగురాళ్ల, తుమ్మలచెరువు, నడికుడి స్టేషన్ల పరిధిలో వరుస దొంగతనాలు అధికంగా జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రాలకు చెందిన పార్థీ గ్యాంగ్, సోలాపూర్, మీర్జాపూర్, జూమ్‌కేడ్, బీడ్ తదితర ప్రాంతాలకు చెందిన నేరస్తులు సిగ్నల్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేసి, రైలు దొంగతనాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ దొంగతనాలకు లోకల్ పోలీసులకు సంబంధం ఉండదు. రైల్వే పోలీసులే విచారణ జరుపుతారు. అయితే, దొంగతనాలకు ముందు ఆయా ముఠాలు రైల్వే స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో సంచరించి, రెక్కీ నిర్వహిస్తున్నాయి. జిల్లాలో పోలీసు నిఘా వ్యవస్థ గట్టిగా పనిచేస్తే వారి సంచారాన్ని గుర్తించి దొంగతనాలు జరగకముందే అరెస్ట్ చేసే అవకాశముందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో వరుస దొంగతనాలు జరుగుతుంటే అడ్డుకోవాల్సిన పోలీసు వ్యవస్థ ఏం చేస్తోందన్న ప్రశ్నలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీల నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులుపెట్టి వేధించడానికే సిబ్బందిని వినియోగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వ రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో ఖాకీలు బిజీగా ఉండటంతో అసాంఘిక కార్యక్రమాలు అధికమయ్యాయని ప్రజలు భావిస్తున్నారు. జిల్లాలో అక్రమ నిర్బంధాలు, చిత్రహింసలతో వరుసగా పోలీసులు హైకోర్టుతో చివాట్లు తింటున్నారు. అయినా, వారి తీరులో మార్పు రావడం లేదు. పోలీసులు ఇప్పటికై నా జిల్లాలో దొంగతనాలు, హత్యలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

చోర్.. పల్నాడు బేజార్ !