
రియల్టర్ దందా.. అడ్డుకట్ట ఉందా ?
నరసరావుపేట మండలం కాకాని వద్ద మూడు ఎకరాల అసైన్డ్ ల్యాండ్ ఆక్రమణ ప్లాట్లు వేసి విక్రయాలు ఆక్రమించిన భూమి విలువ రూ.10కోట్లు
ఆక్రమణకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల అండ
చర్యలు తీసుకుంటాం
నరసరావుపేట రూరల్: రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆక్రమణలకు వాగులు, వంకలు, కాలవలు.. కాదేది అనర్హం అన్నట్టుగా నరసరావుపేటలో పరిస్థితి ఉంది. రెవెన్యూ అధికారులు పూర్తి సహకారం అందిస్తుండటంతో వీరి ఆక్రమణలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. నూతనంగా జిల్లాగా ప్రకటించిన తరువాత నరసరావుపేటలో భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. రూ. లక్షలో ఉన్న ఎకరం భూమి రూ.కోట్లకు చేరింది. నరసరావుపేట పట్టణం సమీపంతో పాటు మండల పరిధిలోని పలు గ్రామాలకు రియల్ ఎస్టేట్ వ్యాపారం విస్తరించింది. వందలాది ఎకరాల్లో వెంచర్లు వేసి విక్రయాలు జరిపారు. పొలాల్లోని పంట కాలువలను కూడా వెంచర్ల నిర్వాహకులు పూడ్చివేసి ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. పంట కాలువలు పూర్తిగా మూసివేయడంతో సాగునీరు అందక రైతులు పలు చోట్లు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు ఫిర్యాదులు అందుతున్నా చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు వేస్తున్నారు.
కాకానిలో మూడు ఎకరాలకు పైగా ఆక్రమణ
నరసరావుపేట మండలంలోని కాకాని సమీపంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ భూములను కొనుగోలు చేసి, రియల్ ఎస్టేట్ వెంచర్ ఏర్పాటు చేసింది. కాకాని సమీపంలో జేఎన్‌టీయూఎన్ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు కావడంతో ఆ పరిసర ప్రాంతాల్లోని భూములకు డిమాండ్ పెరిగింది. దీంతో అనేక ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఈ ప్రాంతంలో వెంచర్లు ఏర్పాటు చేశాయి. ఈ భూములకు సమీపంలో ఉన్న వరద కాలువను ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ పూర్తిగా ఆక్రమించింది. 505డీఏ1ఏ సర్వే నంబర్‌లో ఉన్న ఈ వరద కాలువ దాదాపు రెండున్నర ఎకరాల్లో ఉంది. లక్ష్మీపురం, కాకాని పంట పొలాల్లోని వర్షం నీరు ఈ కాలువ ద్వారా ప్రవహించాల్సి ఉంది. దిగువున నీటిని నిల్వచేసేందుకు చెక్ డ్యామ్ కూడా నిర్మించారు. దాదాపు 50 ఎకరాలకు పైగా పంట పొలాలకు ఈ చెక్‌డ్యామ్ నీరే ఆధారం. వెంచర్ ఒక వైపు కనిపిస్తున్న వరద కాలువ మధ్యలో అక్రమణకు గురైంది. మరో వైపు చెక్ డ్యామ్ ఉన్నా అక్కడకు నీరు వచ్చి చేరే అవకాశం లేకుండా రియల్ వ్యాపార సంస్థ ప్లాట్లు వేసి గోడను నిర్మించింది. మౌలిక సదుపాయాల కోసం వెంచర్ నిర్వహకులు దాదాపు ఎకరం ఖాళీ స్థలాన్ని కేటాయించారు. అసైన్డ్ ల్యాండ్‌ను ఆక్రమించి అదే భూమిని మౌలిక సదుపాయాలు కోసం కేటాయించినట్టు అధికారులకు చూపించారు.
రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ అసైన్డ్ ల్యాండ్‌ను ఆక్రమించి వెంచర్ వేసిన విషయం నా దృష్టికి రాలేదు. దీనిపై విచారణ జరిపి అసైన్డ్ ల్యాండ్ ఉన్నట్టు తేలితే చర్యలు తీసుకుంటాం.
–కె. మధులత, ఆర్డీఓ, నరసరావుపేట

రియల్టర్ దందా.. అడ్డుకట్ట ఉందా ?

రియల్టర్ దందా.. అడ్డుకట్ట ఉందా ?