
దుర్వాసన.. నరకయాతన
మురుగు నీటి కాల్వ ఆక్రమణ వ్యర్థాలతో నీటిని యార్డులోకి వదులుతున్న దుకాణదారులు ఆవరణంతా దుర్గంధం దుర్వాసనతో అల్లాడుతున్న రైతులు ముక్కు మూసుకొని విధులు నిర్వహిస్తున్న అధికారులు
విచారించి చర్యలు తీసుకుంటా !
నరసరావుపేట టౌన్: షాపింగ్ కాంప్లెక్స్ దుకాణదారుల ఇష్టారాజ్యం.. అధికారుల నిర్లక్ష్యంతో వ్యవసాయ మార్కెట్ యార్డ్ దుర్గంధంగా మారింది. రైతులు ముక్కు మూసుకోవాల్సి వస్తుంది. దుకాణాల్లో వినియోగించిన వ్యర్థపు నీటిని మార్కెట్ యార్డులోకి వదులుతుండటంతో ఆవరణంతా కంపుగొడుతోంది. దుకాణాల ముందున్న మురుగు కాల్వను ఆక్రమించి వ్యాపారాలు నిర్మాణాలు చేపట్టారు. మురుగు పారేందుకు దారి లేదు. దుకాణాల వెనుక పైపులైన్ ఏర్పాటు చేసి, దాని ద్వారా వినియోగించిన నీటిని పంపుతున్నారు. అయితే పైపులు లీకై మురుగు నీరంతా రోడ్లపై ప్రవహిస్తోంది. దీంతో యార్డు పరిసరాలంతా దుర్వాసన వెదజల్లుతోంది.
రైతులకు అవస్థ
వ్యవసాయ మార్కెట్ యార్డుకు వచ్చే రైతులు దుర్వాసనతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మురుగు సమస్య ఎప్పటి నుంచో ఉన్నా శాశ్వత పరిష్కారంపై అధికారులు దృష్టి సారించలేదు. అధికారుల నిర్లక్ష్యంతో పంటల అమ్మకానికి రావాలంటే నరకయాతన తప్పటం లేదని రైతులు వాపోతున్నారు. దుర్వాసనలో రోజంతా కూర్చోలేక పోతున్నామని వాపోతున్నారు.
అధికారులకు సైతం తప్పని తిప్పలు
వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో పలు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ప్రజా పంపిణీ బియ్యం నిల్వ చేసే ఎంఎల్‌ఎస్ పాయింట్‌తో పాటు భూసార పరీక్ష కేంద్రం, అగ్రి టెస్ట్ ల్యాబ్, వ్యవసాయ శాఖ ఏడీ కార్యాలయం, 108 డివిజనల్ కార్యాలయం, ఈవీఎంలు భద్రపరిచిన గోదాం అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఎంఎల్‌ఎస్ పాయింట్ ఎదురుగా ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ వెనుక భాగం నుంచి ప్రతిరోజు పైప్‌లైన్ ద్వారా వృథా నీరు రోడ్డుపైకి చేరుతోంది. దీంతో అక్కడ పనిచేసే అధికారులు, సిబ్బంది, హమాలీలు దుర్గంధానికి తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అనారోగ్యానికి గురవుతున్నామని పలువురు కార్మికులు వాపోతున్నారు. దీంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు పలు పనుల నిమిత్తం ప్రతిరోజు వచ్చే వందల మంది సైతం మురుగు దుర్వాసనకు ముక్కు మూసుకోవాల్సి వస్తోంది.
వ్యర్థ జలాలు పారకుండా ఆక్రమణ
మార్కెట్ యార్డు దుకాణ సముదాయానికి, రోడ్డుకు మధ్యలో 50 అడుగుల ఖాళీ స్థలం ఉంది. అక్కడ గతంలో మురుగు పారేందుకు సైడ్ కాల్వ ఉండేది. కాలక్రమేణా దుకాణదారులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. మురుగు తొలగించేందుకు అవకాశం లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. దీంతో దుకాణదారులు వెనుక భాగంలో పైప్‌లైన్ ఏర్పాటు చేసి వ్యర్థ జలాలను మార్కెట్ యార్డులోకి వదులుతుండటంతో సమస్య జటిలంగా మారింది. అధికారులు స్పందించి ఆక్రమణలు తొలగించి, మురుగు కాల్వను మెరుగు పరచాలని రైతులు కోరుతున్నారు.
వ్యవసాయ మార్కెట్ యార్డు దుకాణ సముదాయ నిర్వహణ ఆ శాఖ అధికారులే చూసుకోవాలి. కాల్వను ఆక్రమించిన విషయంపై విచారణ జరిపి అక్రమార్కులపై చర్యలు తీసుకుంటాం. గతంలో అక్కడ మురుగు కాల్వ ఉంటే దాన్ని పునరుద్ధరించి సక్రమంగా పారేలా చూస్తాం.
జస్వంత్‌రావు, మున్సిపల్ కమిషనర్

దుర్వాసన.. నరకయాతన