
నల్ల బ్యాడ్జీలతో అటవీ సిబ్బంది నిరసన
నరసరావుపేట రూరల్: అటవీ శాఖ సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే దాడికి నిరసనగా పల్నాడు డివిజన్ సిబ్బంది గురువారం నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈనెల 19వ తేదీ రాత్రి శ్రీశైలం శిఖరం చెక్‌పోస్ట్ వద్ద టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి విధుల్లో ఉన్న అటవీశాఖ సిబ్బందిపై దాడి చేశారు. దీన్ని తీవ్రంగా ఖండించిన డివిజన్ సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎమ్మెల్యేను, ఆయన అనుచరులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రేంజ్ ఆఫీసర్ డి.వి. రమణ, అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ అమీర్ జానీ బాషా, డివిజన్ సిబ్బంది పాల్గొన్నారు.
బెల్లంకొండ: అటవీ ప్రాంతంలో విద్యుత్తు లైన్‌కు ఇనుప తీగలు అమర్చి జంతువులను వేటాడటాన్ని సిబ్బంది అడ్డుకున్నారు. మండలంలోని వెంకటాయపాలెం అటవీ ప్రాంతంలో బుధవారం రాత్రి విద్యుత్ లైన్‌కు కనెక్షన్ ఇచ్చి జంతువులను వేటాడేందుకు వేటగాళ్లు తీగలను అమర్చారు. గమనించిన విద్యుత్ సిబ్బంది అక్కడకు వెళ్లగా పరారయ్యారు. వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకుని సబ్ స్టేషన్ తరలించారు. వేటగాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఏఈ పవన్ కుమార్ తెలిపారు.
నేడు సామూహిక వరలక్ష్మి వ్రతం
మంగళగిరి: మంగళాద్రిలో వేంచేసిఉన్న శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయ ఆవరణలో శుక్రవారం సామూహిక శ్రావణలక్ష్మి పూజలు నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం ఆలయ ఈవో సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారికి తిరువంజనం, 9 గంటలకు సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించనున్నట్లు తెలిపారు.
నేడు స్వామి వారి వస్త్రాలు వేలం
శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయ ఆవరణలోని శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారికి భక్తులు సమర్పించిన వస్త్రాలను శుక్రవారం బహిరంగ వేలం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు దిగువ సన్నిధిలోని ఆలయ ఆవరణలో పాట ఉంటుందని ఈవో తెలిపారు.
ఫ్లెక్సీ తొలగింపును అడ్డుకున్న గ్రామస్తులు
భట్టిప్రోలు(వేమూరు): భట్టిప్రోలు మండలం చింతమోటులో బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ ప్లెక్సీలు తొలగించేందుకు అధికారులు సిద్ధంకాగా, గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. విషయాన్ని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు దృష్టికి గ్రామస్తులు తీసుకెళ్లారు. చింతమోటుకు చేరుకున్న అశోక్‌బాబు గ్రామంలో ప్రభుత్వం అనుమతి లేని ఫ్లెక్సీలు అన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. వేమూరు, చుండూరు సీఐలు ఆంజనేయులు, శ్రీనివాసరావు, భట్టిప్రోలు, కొల్లూరు ఎస్‌ఐలు శివయ్య, జానకీ అమర్‌వర్ధన్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామంలో తెలుగుదేశం ఫ్లెక్సీలు, బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ ఫ్లెక్సీలని తొలగిస్తే వెళ్లిపోతామని వరికూటి వారికి స్పష్టం చేశారు. గ్రామాల్లో గొడవలు జరగకుండా పోలీసులు బాధ్యతలు తీసుకోవాలని కోరారు. ఫ్లెక్సీల వ్యవహారం పరిష్కారం చేసే వరకు ఆందోళన కొనసాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నేతలు పడమటి శ్రీనివాసరావు, బొల్లెదు ప్రతాప్, ఇమామ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

నల్ల బ్యాడ్జీలతో అటవీ సిబ్బంది నిరసన

నల్ల బ్యాడ్జీలతో అటవీ సిబ్బంది నిరసన

నల్ల బ్యాడ్జీలతో అటవీ సిబ్బంది నిరసన