
వరినాట్లు వేసిన జిల్లా కలెక్టర్
పిడుగురాళ్ల రూరల్: నిత్యం అధికార కార్యక్రమాలతో బిజీబిజీ ఉండే జిల్లా కలెక్టర్ కాసేపు రైతులతో కలిసి పొలం పనుల్లో పాల్గొన్నారు. మండలంలోని వీరాపురం గ్రామంలో బుధవారం కూలీలు వరి నాట్లు వేస్తుంటే అటుగా కారులో వెళ్తున్న కలెక్టర్ అరుణ్ బాబు కూలీల వద్దకు వచ్చారు. వారిని పలకరిస్తూ రోజుకు ఎంత ఆదాయం వస్తుంది అని తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి వరి నాట్లు వేశారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో యూరియా, డీఏపీకి కొరతలేదని రైతులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఈ సంవత్సరం నాగార్జునసాగర్‌కు సమృద్ధిగా నీరు చేరడంతో పాటు భూగర్భ జలాలు కూడా గత సంవత్సరం కంటే అధికంగా పెరిగాయని నీటికి ఇబ్బంది లేదన్నారు. ఏడీఏ బి.కృష్ణదేవరయలు, ఆర్డీఓ మురళి, తహసీల్దార్ మధుబాబు, వ్యవసాయ విస్తరణ అధికారులు ఆయన వెంట ఉన్నారు.