జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు
నరసరావుపేట: జిల్లాలో పొగాకు పంటను రైతులు ఎవరూ సాగుచేయెద్దని, నారుమళ్లు వేయరాదని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు సూచించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 2024–25లో 3124మంది రైతులు 10,954 ఎకరాల్లో బ్లాక్ బర్లీ పొగాకు పంటను సాగుచేశారని, దీని వలన 1,21,010 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందన్నారు. అధిక దిగుబడితో పొగాకు వ్యాపారులు రైతుల నుంచి పూర్తిస్థాయిలో కొనుగోలు చేయలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేపట్టిందన్నారు. అందువలన ఈ ఏడాది రైతులు ఎవరూ కంపెనీ వ్యక్తుల నుంచి బాండ్లు తీసుకోరాదని, పొగాకు నారుమళ్లు వేయరాదని కోరారు. పొగాకుకు బదులుగా అధిక దిగుబడిని ఇచ్చే పంటలను సాగుచేయాలని కోరారు. మధ్యవర్తులు ఎవరైనా సాగుకు ప్రోత్సహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతేడాది పండిన పొగాకు నిల్వలను కొనుగోలుచేయకుండా ఈ ఏడాది సాగుచేయాలని ప్రోత్సహించటం క్షమించరాని నేరమన్నారు. రైతులు కంపెనీ వారి మాటలు వినిమోసపోవద్దని సూచించారు. పూర్తి బాధ్యతను గ్రామ, మండల స్థాయిలో వ్యవసాయాధికారులు పర్యవేక్షించాలని ఆదేశించామన్నారు.
25న సీజ్ చేసిన బియ్యానికి మళ్లీ వేలం
నరసరావుపేట: ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అండర్ సెక్షన్ 6ఏ కింద సీజ్ చేసిన 6,453 క్వింటాళ్ల రేషన్ బియ్యానికి జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే సమక్షంలో ఈనెల 25న మరోసారి వేలం నిర్వహిస్తున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఎం.వి.ప్రసాదు బుధవారం పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో ఈనెల 12న నిర్వహించిన వేలంలో సరైన ధర రానందున ఈ నిర్ణయం తీసుకోవటం జరిగిందన్నారు. బహిరంగ వేలం ప్రకటనలోని నియమ నిబంధనల మేరకు ఔత్సాహికులు పాల్గొనాలని కోరారు.
పోస్టల్ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి
నరసరావుపేట టౌన్: తపాలా శాఖ ఆధ్వర్యంలో దీన్ దయాల్ స్పర్ష్ యోజన స్కాలర్‌షిప్ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని డివిజనల్ పోస్టల్ సూపరింటెండెంట్ జాఫర్ సాధిక్ తెలిపారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు స్కాలర్‌షిప్‌ను తపాలా శాఖ ప్రవేశపెట్టిందన్నారు. తపాలా శాఖ నిర్వహించే ఫిలాటెలి క్విజ్ మరియు ఫిలాటెలి ప్రాజెక్ట్‌ల ఆధారంగా ఏడాదికి రూ.6 వేలు స్కాలర్‌షిప్ పొందవచ్చన్నారు. విద్యార్థి 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలలో చదువుతూ, సంబంధిత పాఠశాలల్లో ఫిలాటెలి క్లబ్ సభ్యుడై ఉండాలన్నారు. పాఠశాలల్లో ఫిలాటెలి క్లబ్ లేకపోతే అభ్యర్థి తన సొంత ఫిలాటెలి అకౌంట్ కలిగి ఉండాలన్నారు. ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు సమీపంలోని పోస్టాఫీసుల్లో సంప్రదించాలన్నారు.
నీట్ పీజీ సెట్‌లో డాక్టర్ ప్రవల్లికకు 1820 ర్యాంక్
నరసరావుపేట ఈస్ట్: మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పీజీ–2025 పరీక్షలో పట్టణానికి చెందిన డాక్టర్ ముద్దా ప్రవల్లిక ఓపెన్ క్యాటగిరీలో 1820 ర్యాంక్ సాధించింది. వైజాగ్ ఎన్‌ఆర్‌ఐ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ప్రవళ్లిక నీట్ పీజీ సెట్‌లో 613 మార్కులతో ఉత్తమ ర్యాంక్ సాధించింది. డాక్టర్ ప్రవల్లిక తండ్రి ముద్దా రమేష్ పట్టణంలోని శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాలలో గణిత శాస్త్ర అధ్యాపకునిగా పని చేస్తుండగా, తల్లి ఉషారాణి గృహిణి. చిన్న పిల్లలకు వైద్యసేవలు అందించేందుకు తాను పిడియాట్రిక్ విభాగంలో పీజీ చేయనున్నట్టు డాక్టర్ ప్రవల్లిక తెలిపారు.
జిల్లాలో 69.4 మి.మీ వర్షం
నరసరావుపేట: గడిచిన 24 గంటల వ్యవధిలో జిల్లాలోని 28 మండలాలకు గాను 14 మండలాల్లో వర్షం పడలేదని జిల్లా అధికారులు పేర్కొన్నారు. మిగిలిన మండలాల్లో 69.4 మిల్లీమీటర్ల వర్షం కురిసిందన్నారు. అత్యధికంగా మాచర్లలో 20.2 మి.మీ వర్షం పడగా అత్యల్పంగా 0.6 అమరావతిలో కురిసింది. వెల్దుర్తి 7.0, దుర్గి 8.0, గురజాల 2.0, కారంపూడి 2.4, బొల్లాపల్లి 2.4, వినుకొండ 2.8, నూజెండ్ల 1.8, శావల్యాపురం 1.4, ఈపూరు 2.6, రొంపిచర్ల 5.6, నరసరావుపేట 3.6, చిలకలూరిపేట 5.0 మి.మీ వర్షం కురిసింది.
‘డీ ఫార్మసీ’లో ప్రవేశాలకు గడువు పొడిగింపు
గుంటూరు ఎడ్యుకేషన్: గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌లో రెండేళ్ల కాలపరిమితి గల డీఫార్మసీ కోర్సులో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ గడువును సాంకేతిక విద్యాశాఖ ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ జాస్తి ఉషారాణి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియెట్ రెగ్యులర్, దూరవిద్య ద్వారా బైపీసీ, ఎంపీసీ పూర్తి చేసిన విద్యార్థినులతో పాటు సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ బోర్డు నుంచి తత్సమానమైన పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థినులు అర్హులని తెలిపారు. ఆదాయ ధ్రువీకరణ పత్రం, తెల్ల రేషన్ కార్డు కలిగిన ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థినులకు ప్రభుత్వం ద్వారా అడ్మిషన్ ఫీజులో మినహాయింపుతోపాటు ఉపకార వేతనాలకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రవేశం పొందిన విద్యార్థినులకు కళాశాల ప్రాంగణంలోనే హాస్టల్ వసతి ఉందని తెలిపారు. ఆసక్తి గల వా రు సర్టిఫికెట్లతోపాటు పాస్‌పోర్ట్ సైజు ఫొటో, దరఖాస్తు రుసుము రూ.400తో కళాశాల ప్రిన్సిపాల్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.