
పత్తిపై దిగుమతి సుంకం తొలగింపు సరికాదు
నల్లమడ రైతు సంఘం కన్వీనర్ డాక్టర్ కొల్లా రాజమోహనరావు
చిలకలూరిపేట: ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే పత్తి మీద అన్ని రకాల సుంకాలను మినహాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించటం దారుణమని నల్లమడ రైతు సంఘం కన్వీనర్ డాక్టర్ కొల్లా రాజమోహనరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మీడియాతో మాట్లాడుతూ ఈ నిర్ణయం పత్తి రైతులకు మరణ శిక్ష విధింపుతో సమానమని ఆవేదన వ్యక్తం చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా కూడా ఇది రైతు వ్యతిరేక చర్య అని ఖండించిందని వెల్లడించారు. పత్తిపై దిగుమతి సుంకాన్ని తొలగించే ప్రభుత్వ నోటిఫికేషన్ పత్తి రైతులపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది దేశంలో పండించే పత్తి ధరపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందన్నారు. దేశీయంగా పండించే పత్తి ధర ఖచ్చితంగా తగ్గుతుందని, రైతులు మరింత అప్పుల పాలవుతారన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం క్వింటా పత్తికి రూ.10,075 రావాలని, కానీ ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.7,710 మాత్రమే ఉందని వెల్లడించారు. ఆ ధరకు కూడా పత్తి అమ్ముడు పోవడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో దిగుమతి సుంకం ఎత్తివేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పత్తి రైతులకు తీవ్రంగా నష్టపరుస్తుందన్నారు.