
చేనేత పరిశ్రమను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వాలు
చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ
సత్తెనపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పవర్ లూమ్స్, జెట్ లూమ్స్‌లకు రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తూ చేనేత పరిశ్రమను నిర్వీర్యం చేస్తున్నాయని, ఈ అంశాలను అక్టోబర్ 6, 7 తేదీలలో సత్తెనపల్లిలో జరిగే చేనేత కార్మిక సంఘం రాష్ట్ర 11వ మహాసభలో చర్చించి పోరాటాలకు పిలుపునిస్తామని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ హెచ్చరించారు. సత్తెనపల్లిలో బుధవారం జరిగిన చేనేత కార్మిక సంఘం పల్నాడు జిల్లా కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై కరపత్రాలను ఆవిష్కరించారు. సమావేశానికి సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టా శివ దుర్గరావు అధ్యక్షత వహించారు. బాలకృష్ణ మాట్లాడుతూ చేనేతపై ఉన్న జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని, చేనేతకు కేటాయించిన 11 రకాల రిజర్వేషన్లు కచ్చితంగా కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాలన్నీ రాష్ట్ర మహాసభలలో చర్చించి, భవిష్యత్ కార్యచరణ రూపొందిస్తామన్నారు. సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి అనుముల వీర బ్రహ్మం, కమిటీ సభ్యులు బిట్రా పానకాలు, పంతంగి ప్రభాకర్, గడ్డం సుసులోవ్, గనికపూడి యేసు రత్నం, వలపర్ల చిన్న దెబ్బయ్య, మోపత్తి బాబు రాజు పాల్గొన్నారు.