
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు
దాచేపల్లి: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టిన సంఘటనలో దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామానికి చెందిన దొడ్డా శ్రీను(30) మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మిర్యాలగూడ నుంచి దాచేపల్లి వైపు వస్తున్న కారు ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ వాహనంలో గామాలపాడుకు చెందిన అన్నదమ్ములైన దొడ్డా సైదులు, దొడ్డా శ్రీను ఉన్నారు. కారు బలంగా ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనం కిందపడి శ్రీనుకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సైదులు తీవ్రంగా గాయపడ్డాడు. ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టిన తర్వాత ఈ రెండు వాహనాలు రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన మరో ఆటోను బలంగా ఢీకొట్టాయి. ఆటో బోల్తాపడటంతో అందులో ఉన్న మరో ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను పిడుగురాళ్లలోని వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడు శ్రీనుకి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
ఒకరు మృతి.. ముగ్గురికి గాయాలు

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు