
రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి
పొన్నూరు: సాగులో రసాయన ఎరువులను తగ్గించాలని గుంటూరు బయోలాజికల్ కంట్రోల్ ల్యాబ్ ఏడీఏ సునీత రైతులకు సూచించారు. బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా మండలంలోని వడ్డిముక్కల, ఆలూరు గ్రామాల్లో స్థానిక ఏడీఏ రామకోటేశ్వరితో కలిసి ఆమె పంట పొలాలను సందర్శించారు. రైతులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ జీవన ఎరువులైన పాస్ఫరస్ సాల్యుబ్ లైజింగ్ బ్యాక్టీరియాను (పీఎస్‌బీ)వినియోగించడం వలన పొలంలో భాస్వరాన్ని కరిగించి పంటకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. దీని వలన ఎరువుల వినియోగం తగ్గించవచ్చని అన్నారు. ఏడీఏ రామకోటేశ్వరి మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ నగదు జమ కానివారు రైతు సేవా కేంద్రాల్లో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో వీఏఏ పి. ప్రసాదు, ఎంపీఈఓ ఎస్. సురేష్‌బాబు, రైతులు పాల్గొన్నారు.