
వైఎస్సార్ సీపీ నేతలపై విమర్శలు తగవు
టీడీపీ నాయకులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలి ‘రాజధాని ముంపు’పై వైఎస్సార్ సీపీ నాయకులు
మంగళగిరి: కొండవీడు వాగు వరద మళ్లింపుతోపాటు కృష్ణా నది నుంచి నీరు వెనక్కి తన్నడం వలనే మంగళగిరి, తాడేపల్లి, పెదకాకాని తదితర మండలాలు మునిగాయని వైఎస్సార్ సీపీ నాయకులు తెలిపారు. మండలంలోని నీరుకొండ, కురగల్లుల మధ్య వాగు ముంపు ప్రాంతాలను పరిశీలించిన వైఎస్సార్ సీపీ వివిధ అనుబంధ సంఘాల నాయకులు మాట్లాడుతూ తమ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త వేమారెడ్డి వాగు వరద మళ్లిపు, ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల కారణంగా 70 వేల ఎకరాలు పంటలు మునిగాయని చెప్పారన్నారు. రైతులను ఆదుకోవాలని కోరారన్నారు. టీడీపీ నాయకులు దీనికి సమాధానం చెప్పకుండా అడ్డగోలుగా విమర్శిస్తున్నారని పేర్కొన్నారు. వర్షం తగ్గినా మంగళవారం వరకు ఇక్కడ కనుచూపు మేర నీరు నిలిచిందన్నారు. కార్యక్రమంలో నాయకులు జంగాల నాగిరెడ్డి, మల్లవరపు సుధారాణి, సయ్యద్ గౌస్ మొహిద్దీన్, ఆర్ధల చిన్నారి, కట్టెపోగు భూషణం, షేక్ గౌస్ పాల్గొన్నారు.