
ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి
లక్ష్మీపురం: ఆటో కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు నన్నపనేని శివాజీ డిమాండ్ చేశారు. గుంటూరు హిందూ కళాశాల సెంటర్‌లో మంగళవారం ఫెడరేషన్ తరఫున ఆటో కార్మికుల యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు షేక్.మస్తాన్‌వలి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో నష్టపోతున్న ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలన్నారు. వాహన మిత్ర కింద రూ.25 వేల సాయం అందివ్వాలని డిమాండ్ చేశారు. సంక్షేమ బోర్డు, తక్కువ వడ్డీకి రుణాలు అందించే ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అన్ని రకాల ఫీజులు, పెనాల్టీలు తగ్గించాలని కోరారు. లేకుంటే ఈ నెల 24వ తేదీన ఒంగోలులో జరిగే రాష్ట్ర మహాసభలో చర్చించి ఆందోళన చేపడతామన్నారు. గుంటూరు జిల్లా ఆటోడ్రైవర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా అధ్యక్షుడు బి. లక్ష్మణరావు, గుంటూరు నగర ఆటోడ్రైవర్స్ యూనియన్ కార్యదర్శి జి.శంకర్ రావు, కె.కోటేశ్వరరావు, షేక్ ఖాసిం, అశోక్, షేక్ జానీ, వెంకటయ్య, సాంబయ్య, సర్దార్ తదితరులు పాల్గొన్నారు.