బస్సులు పెంచరే! | - | Sakshi
Sakshi News home page

బస్సులు పెంచరే!

Aug 20 2025 5:20 AM | Updated on Aug 20 2025 5:20 AM

బస్సు

బస్సులు పెంచరే!

ఆర్భాటంగా సీ్త్ర శక్తి పథకం ప్రారంభించిన ప్రభుత్వం లక్షల మంది మహిళలకు స్వల్ప సంఖ్యలోనే బస్సులు బస్సుల సంఖ్య పెంచి అన్నిరకాల సర్వీసుల్లో ఉచితం అమలు చేస్తేనే ఉపయోగం ఉచిత బస్సుల కోసం బస్టాండుల వద్ద మహిళల పడిగాపులు జిల్లాలో బస్సు ముఖం చూడని 195 గ్రామాలు తమ గ్రామానికి బస్సు లేనప్పుడు ఉచితమైనా ఉపయోగమేమిటంటున్న మహిళలు

సాక్షి, నరసరావుపేట: సీ్త్ర శక్తి పేరుతో కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు పథకాన్ని ఆర్భాటంగా ప్రారంభించి చేతులు దులుపుకొంది. అన్ని రకాల బస్సుల్లో ఉచిత సౌకర్యం కల్పించకపోవడంతో మహిళలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంతో పాటు గుంటూరుకు ఎక్కువగా సూపర్‌ లగ్జరీ బస్సు సర్వీ సులు నడుస్తున్నాయి. వీటిలో మహిళలకు ఉచిత సౌకర్యం లేదు. అలాగే నరసరావుపేట – గుంటూరు నగరాల మధ్య సుమారు 17 నాన్‌స్టాప్‌ బస్సులు నడుస్తున్నాయి. వీటిలో మహిళలు నగదు చెల్లించి టికెట్‌ తీసుకోవాల్సిందే. పోనీ పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సు ల్లో అయినా ప్రయాణిద్దామంటే ఆ బస్సుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. కొత్తవి కొనుగోలు చేసి బస్సుల సంఖ్య పెంచుతామన్న ప్రభుత్వం ఆ దిశగా చర్యలేవి తీసుకోలేదు.

బస్సు ముఖం చూడని గ్రామాలు

గ్రామీణ జనాభా అధికంగా ఉన్న పల్నాడు జిల్లాలో ఆర్టీసీ సేవలు అంతంతమాత్రంగా ఉంటున్నాయి. డిపోలలో బస్సుల కొరత తీవ్రంగా ఉంది. ఉన్న వాటిలో చాలా వరకు కండీషన్‌లో లేవు. ఇటీవల కాలంలో వినుకొండ, మాచర్ల బస్సుల్లో స్టీరింగ్‌ రాడ్‌ విరిగిపోయి ప్రమాదం నుంచి తప్పించుకున్న ఘటనలు జరిగాయి. జిల్లావ్యాప్తంగా 195 గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. ముఖ్యంగా మాచర్ల, వినుకొండ డిపోల పరిధిలోని గ్రామాలలో ఈ సమస్య అధికంగా ఉంది. ఈ నేపధ్యంలో ప్రభుత్వం ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకొన్నా ఉపయోగం లేదని మహిళ లు పెదవి విరుస్తున్నారు. తమ గ్రామాలకు బస్సు సౌకర్యం లేకుండా ఉచితమంటే ఉపయోగమేంటని ప్రశ్నిస్తున్నారు. ఆయా గ్రామాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తేనే ఉచిత బస్సు ప్రయోజనాలను మహిళలు పొందగలుగుతారు. లేకుంటే కూటమి ప్రభుత్వ ప్రచారానికి మాత్రమే ఈ పథకం పరిమితం కానుంది.

నరసరావుపేట బస్టాండ్‌లో పల్లె వెలుగు బస్సు ఎక్కేందుకు పాట్లు

నరసరావుపేట బస్టాండ్‌లో బస్సుల కోసం ఎదురు చూస్తున్న మహిళలు

‘తాంబూలాలు ఇచ్చాం.. తన్నుకు చావండి’ అన్నట్లుంది కూటమి ప్రభుత్వం ప్రారంభించిన సీ్త్ర శక్తి పథకం తీరు. మహిళలకు ఉచిత బస్సు అంటూ ఆర్భాటంగా ప్రారంభించి, ఆనక చేతులు దులుపుకొన్నారు. బస్సులు లేక.. కేటాయించిన అరకొర బస్సుల్లో సీట్లు లేక.. కష్టపడి ఎక్కితే నిలబడేందుకు సైతం తావు లేక.. మహిళలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఆర్టీసీ బస్టాండుల వద్ద ఉచిత బస్సు ఎక్కాలంటే యుద్ధ వాతావరణమే కనిపిస్తోంది. జిల్లాలోని 195 గ్రామాలకు అసలు బస్సు సౌకర్యమే లేకపోవడంతో వేలమంది మహిళలు పథకానికి దూరమై.. ప్రమాదకర స్థితిలో ఆటోలనే ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఉచితం సరే.. బస్సులు పెంచరే.. అని మహిళలు పెదవి విరుస్తున్నారు.

పల్నాడు జిల్లావ్యాప్తంగా ఆరు ఆర్టీసీ బస్సు డిపోల పరిధిలో మొత్తం 439 బస్సులు ప్రయాణికులకు సేవలు అందిస్తుంటాయి. ఇందులో ఉచిత బస్సు పథకం కింద 364 పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సులు మహిళలకు ఉపయోగపడుతున్నాయి. ఇవే పల్నాడు జిల్లావ్యాప్తంగా గ్రామీణ ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. సుమారు 14 లక్షల మహిళలున్న జిల్లాలో కేవలం 364 బస్సులకు మాత్రమే ఉచిత సదుపాయం ఇవ్వడమేంటని మహిళామణులు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో ఉచిత బస్సు పథకం అమలు చేయకముందు సగటున రోజు రూ.12 నుంచి 13 లక్షల ఆదాయం లభించేదని, ప్రస్తుతం ఆదాయం రూ.18 లక్షలకు పైగా ఉంటోందని అధికారులు చెబుతున్నారు. అంటే దాదాపు 30 నుంచి 50 శాతం దాకా ఆక్యుపెన్సీ పెరిగింది. గతంలోనే జిల్లాలో తీవ్ర బస్సుల కొరత ఉంది. అలాంటి సమయంలో ఆక్యుపెన్సీ పెరిగిన నేపథ్యంలో కొత్త సర్వీసులు పెంచాలి. ఇదే విషయాన్ని ఆర్టీసీ అధికారులు సైతం ప్రభుత్వానికి నివేదించారు. అయినా కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

ఆటోలలో వెళుతున్నాం..

అన్ని గ్రామాలకు బస్సులను నడపకపోతే ఉపయోగం లేదు. మా గ్రామానికి ఆర్టీసీ బస్సు రాకపోవడంతో ఆటోలలో ప్రయాణించాల్సి వస్తోంది. అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తేనే పథకాన్ని పూర్తిగా ఉపయోగించుకోగలం.

– తిరువీధి శివకుమారి, పిచ్చుకలపాలెం,

శావల్యాపురం మండలం

బస్సులు పెంచరే! 1
1/3

బస్సులు పెంచరే!

బస్సులు పెంచరే! 2
2/3

బస్సులు పెంచరే!

బస్సులు పెంచరే! 3
3/3

బస్సులు పెంచరే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement