
వరద ఉధృతం.. భయం భయం
దాచేపల్లి మండలం రామాపురం మత్స్యకారుల కాలనీకి చేరువలోకి కృష్ణా నది వరద నీరు భయం గుప్పిట్లో గ్రామస్తులు
దాచేపల్లి: కృష్ణా నదిలో వరద నీటి ఉధృతితో స్థానిక మత్స్యకారుల కాలనీ ముంపు ముంగిట్లో ఉంది. వివరాల్లోకి వెళితే.. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం రామాపురం గ్రామంలోని మత్స్యకారుల కాలనీని ఆనుకొని కృష్ణానది మంగళవారం ఉధృతంగా ప్రవహిస్తోంది. కాలనీలోని నివాస గృహాలకు కూతవేటు దూరంలో వరద నీరు ప్రవహిస్తుండంతో మత్స్యకారులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. కాలనీలో 50కి పైగా మత్స్యకార కుటుంబాలు నివసిస్తున్నాయి. నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్ల నుంచి వరద నీరు దిగువకు విడుదల చేయడం వలన నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటి విడుదల పెరిగితే కాలనీలోకి వరద నీరు చేరే అవకాశం ఉంది. నదిలో నీటి ప్రవాహం మరింత పెరిగితే మత్స్యకారులను అక్కడి నుంచి ఖాళీ చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.