
పిడుగు గుట్టు.. పసిగట్టు !
వర్షాకాలంలో పిడుగులతో పొంచి ఉన్న ముప్పు
ప్రాణాలపై పిడుగుపాటు
‘దామిని లైట్నింగ్ ’ యాప్‌తో పిడుగుల ముందస్తు హెచ్చరికలు
జాగ్రత్తలు పాటిస్తే బయటపడ వచ్చంటున్న నిపుణులు
అప్రమత్తంగా ఉండాలి
కలర్‌తో కనుక్కోవచ్చు
బెల్లంకొండ: వర్షాకాలం వచ్చిందంటే ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తుంటాయి. పిడుగులు కూడా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పిడుగు ఎప్పుడు పడుతుందో.. ఎలా పడుతుందో తెలియని పరిస్థితిలో ప్రమాదాలు వాటిల్లి ఒక్కోసారి ప్రాణ నష్టం కూడా సంభవిస్తుంది. అదేవిధంగా మెరుపుల దాటికి గృహోపకరణాలు కూడా కాలిపోతూ ఉంటాయి. పిడుగులోని కాంతి ప్రభావంతో నష్టం భారీగానే కలుగుతుంది. ఈ పరిస్థితుల్లో పిడుగు నుంచి రక్షించుకునేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల శాఖ ఎప్పటికప్పుడు మెసేజ్‌ల రూపంలో హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటుంది. పిడుగుపాటును ముందే తెలుసుకోగలిగితే ప్రాణాలు కాపాడుకోవచ్చు. ఈ పిడుగు ప్రమాదాన్ని ‘దామిని లైట్నింగ్ యాప్’తో అరగంట ముందే గుర్తించగలిగే అవకాశం ఉంది.
ముప్పు ముందే తెలుసుకోవచ్చు
పూణే కేంద్రంగా ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటరాలజీ (ఐఐటీఎం) నాలుగేళ్ల క్రితం ఈ యాప్‌ను రూపొందించింది. పిడుగుపాటును గుర్తించేందుకు దేశవ్యాప్తంగా వివిధ నగరాలలో 83 చోట్ల ప్రత్యేక సెన్సార్లను అమర్చారు.
కాపర్ ఎర్త్‌వైర్‌తో ప్రమాదాలకు చెక్..
ఇంటి పరిసర ప్రాంతాల్లో పిడుగుపాటు నుంచి కాపర్ ఎర్త్ వైర్ ఏర్పాటుతో తప్పించుకునే అవకాశం ఉంది. ఇంటి ఆవరణలో కొంత ఎత్తయిన ప్రదేశం నుంచి నేరుగా భూమిలోకి కాపర్ ఎర్త్ (రాగి వైర్ ను అనుసంధానం చేస్తూ భూమిలోకి పాతాలి) ఏర్పాటు చేయడం ద్వారా దాదాపుగా కిలోమీటర్ దూరంలో పడిన పిడుగును నేరుగా భూమిలోకి ఇదే ఆకర్షించుకుంటుంది. ఎర్త్ వైర్‌ను ఉప్పు, కర్ర బొగ్గు, నీటి మిశ్రమాలతో రాగి వైరు కలిగిన రాడ్‌ను భూమి లోపలికి ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదాలకు చెక్ పెట్టే అవకాశం ఉంటుంది.
ఎరుపు : మీరు ఉన్న ప్రాంతంలో మరో ఏడు నిమిషాల్లో పిడుగు పడే అవకాశం ఉంటే యాప్‌లోని సర్కిల్ ఎరుపు రంగులోకి మారుతుంది.
పసుపు : మరో 10 నుంచి 15 నిమిషాల్లో పిడుగు పడే అవకాశం ఉంటే యాప్ లోని సర్కిల్ పసుపు కలర్ లోకి మారుతుంది.
నీలం : 15 నుంచి 25 నిమిషాల్లో పిడుగు పడే అవకాశం ఉంటే ఆ సర్కిల్ బ్లూ కలర్‌లోకి మారిపోతుంది.
వాతావరణంలో మార్పులు జరిగి వర్షాలు పడుతున్న సమయంలో బయటకు వెళ్లకుండా పనులు ఆపుకొంటే మంచిది. అత్యవసర పనులు ఉండి వర్షంలో బయటకు వెళ్లిన సమయంలో దామిని లైటింగ్ యాప్ ఉపయోగించి పిడుగు ఎక్కడ పడుతుందో.. ఏ సమయంలో పడుతుందో పసికట్టవచ్చు. తద్వారా ప్రమాదానికి గురికాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
– ప్రవీణ్ కుమార్, తహసీల్దార్, బెల్లంకొండ