
ఘనంగా ఆదివాసీ దినోత్సవం
నరసరావుపేట రూరల్: గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వాలు చేపడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు తెలిపారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గుర్రం జాషువా సమావేశ మందిరంలో శనివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా పట్టణంలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో గిరిజన సంఘ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. సంఘ నాయకులు మాట్లాడుతూ గిరిజన భవన్ నిర్మాంచాలని కోరారు. గిరిజనులకు అధార్‌కార్డు, ఇళ్ల స్థలాలు ఇప్పించాలని కోరారు. జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు మాట్లాడుతూ గిరిజన భవన్ నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు పంపాలని తెలిపారు. గిరిజనులకు ఆధార్‌కార్డులు, ఇళ్ల స్థలాలు మంజూరుకు చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ అధికారిని ఆదేశించారు. భారత ప్రభుత్వం పీఎం జన్ మన్ పథకంలో తొమ్మిది ప్రభుత్వ శాఖల సహకారంతో 11 స్కీమ్‌ల ద్వారా గిరిజనుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ పథకం ద్వారా చెంచుగూడెంలో అర్హులైన వారికి ఇళ్లు కట్టించడం, రోడ్లు వేయడం, తాగునీటి వసతి కల్పిచండం, అంగన్‌వాడీ సెంటర్ ఏర్పాటు చేస్తారని తెలిపారు. అనంతరం 2024–25 విద్యా సంవత్సరం 10వ తరగతిలో 550మార్కులు పైగా సాధించిన గిరిజన విద్యార్థులు బి.సాయితేజనాయక్, కె.సంపత్‌నాయక్‌లకు రూ.5వేల నగదు ప్రోత్సాహకాన్ని జిల్లా కలెక్టర్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి జోస్న, గిరిజన సంఘం నాయకులు కోటా నాయక్, పాండునాయక్, విష్ణునాయక్, మేడా పోతురాజు, శ్రీరావుల కొండలు, కె.దాసు తదితరులు పాల్గొన్నారు.