
ఆర్వోబీ నిర్మాణంలోహైకోర్టు ఆదేశాల ఉల్లంఘన
గుంటూరు ఎడ్యుకేషన్: నగరంలోని శంకర్ విలాస్ ఫ్లయ్ ఓవర్ నిర్మాణానికి సంబంధించిన కేసు హైకోర్టులో విచారణలో ఉండగానే కూల్చివేత పనులు ప్రారంభించిన అధికార యంత్రాంగం కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తోందని బెటర్ శంకర్‌విలాస్ ఫ్లయ్ ఓవర్ సంయుక్త కార్యాచరణ సమితి (జేఏసీ) కన్వీనర్ ఎల్‌ఎస్ భారవి అన్నారు. శనివారం అరండల్‌పేటలోని ఓ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో భారవి మాట్లాడుతూ.. పనుల్లో నగరపాలక సంస్థ, ఆర్ అండ్ బీ అధికారులు పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. సేతు బంధన్ ప్రాజెక్టు కింద బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసిన కేంద్రం విధించిన నిబంధనలను పాటించకుండా, ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గాలను చూపకుండా కూల్చివేత పనులు చేపట్టారని అన్నారు. ప్రజా రవాణాకు ఇబ్బందులు లేకుండా ఇరువైపులా 12 అడుగులతో కూడిన రోడ్లను అందుబాటులోకి తీసుకువస్తామని హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించిన అధికారులు కోర్టును సైతం తప్పుదారి పట్టించారన్నారు. హైకోర్టు స్టే ఎత్తివేసిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అరండల్‌పేట, బ్రాడీపేటలను కలుపుతూ మార్గాలను ఏర్పాటు చేయాలని చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. ముందుగానే రైల్వేగేటు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నియమించిన కన్సల్టెన్సీ చేసిన సూచనలు బుట్టదాఖలు చేశారన్నారు. జేఏఈ కో–కన్వీనర్ ఎన్వీ కమల్‌కాంత్ మాట్లాడుతూ ఈ నెల 20న న్యాయస్థానం విచారణ జరిపి, తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో పనులు ప్రారంభించేశారని చెప్పారు. సమావేశంలో జేఏసీ ప్రతినిధి వల్లూరి సదాశివరావు, అరండల్‌పేట, బ్రాడీపేట షాప్ ఓనర్ల అసోసియేషన్ అధ్యక్షుడు బెల్లంకొండ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.