‘ఎన్‌ఎస్పీ’ వాసులపై పోలీసుల దౌర్జనం
నరసరావుపేట: తమకు శాశ్వత నివాసాలు ఏర్పాటుచేసి పునారావాసం కల్పించేంతవరకు కాలనీని వదిలి వెళ్లబోమని కాలనీ స్థానిక ఎన్‌ఎస్‌పీ వాసులు, ప్రజాసంఘాల నాయకులు అధికారులకు తేల్చిచెప్పారు. తమపై పోలీసుల దౌర్జన్యాలను నిరసిస్తూ మంగళవారం కాలనీవాసులు పిల్లా పాపలతో కలిసి కలెక్టర్ కార్యాలయం ఆవరణలో రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ డిమాండ్లతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. కలెక్టర్ కార్యాలయానికి వెళ్లేందుకు యత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. వారికి సీపీఐ, సీపీఎం, రైతుసంఘం, పలు ప్రజాసంఘాల నాయకులు మద్దతు పలికారు. కాలనీ వాసుల నాయకుడు, మాలమహానాడు జిల్లా కార్యదర్శి బోరుగడ్డ అంబేడ్కర్ విలేకరులతో మాట్లాడారు. తమ కాలనీలోని 35 ఎకరాల భూమిలో ఉద్యోగుల కార్యాలయాలు, ఉద్యోగులకు క్వార్టర్స్ నిర్మాణం చేశారని, 60 ఏళ్లుగా సుమారు 300 కుటుంబాలు నివాసం ఉండేవారన్నారు. శిథిలావస్థలో ఉన్న క్వార్టర్స్‌లో ప్రస్తుతం 62 విశ్రాంత ఉద్యోగులు, పెన్షనర్లకు చెందిన కుటుంబాలు మాత్రమే నివసిస్తూ కాలం వెళ్ల దీస్తున్నారన్నారు. నరసరావుపేటను పల్నాడు జిల్లా కేంద్రంగా ప్రకటించగానే అధికారులు కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు ఏర్పాటుచేసి పాలన కొనసాగిస్తున్నారన్నారు. అప్పటి నుంచి కాలనీవాసులకు కష్టాలు మొదలయ్యాయని, ఆ ప్రాంతాన్ని నిషిద్ధ ప్రదేశంగా మార్చి వేశారని పేర్కొన్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ కోసం స్థలం కేటాయించి కాలనీ ప్రాంగణంలో విశాలమైన రోడ్లు నిర్మాణం చేసిన అధికారులు కాలనీ చుట్టూ ముళ్ల కంచె ఏర్పాటుచేసి ఆ రోడ్లపై కాలనీవాసులు నడవకుండా ఆంక్షలు విధించారన్నారు.
నోటీసులు ఇవ్వకుండానే..
కాలనీ వాసులకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే క్వార్టర్స్ ఖాళీ చేసి వెళ్లి పోవాలని పోలీసులు హుకుం జారీ చేస్తున్నారని బోరుగడ్డ తెలిపారు. సోమవారం రాత్రి టూ టౌన్ సీఐ సిబ్బందితో కాలనీలో విద్యుత్ నిలిపి వేయించారని, కాలనీ యువకుల బైకులను బలవంతంగా స్టేషన్‌కు తరలించారన్నారు. తెల్లవారేలోపు క్వార్టర్స్ ఖాళీచేసి వెళ్లిపోవాలని, లేదంటే పొక్లెయిన్లతో కూల్చి వేస్తామని హెచ్చరించి వెళ్లారన్నారు. దీనిపై తాము స్థానిక ఎమ్మెల్యేను, జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించామని, విషయం తెలుసుకున్న పోలీసులు కాలనీవాసులు కలెక్టరేట్ కాంపౌండ్ దాటకుండా ఆంక్షలు విధించారన్నారు. కాలనీవాసులకు ప్రభుత్వమే నివాస స్థలాలు మంజూరు చేసి వారికి పక్కా ఇళ్లు నిర్మించిన తర్వాతనే వారిని ఖాళీ చేయాలని, అప్పటి వరకు వారు నివశిస్తున్న క్వార్టర్స్‌లోనే ఉండనివ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం నాయకులు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కుల నిర్మూలన పోరాట సమితి (కేఎన్‌పీఎస్) రాష్ట్ర కార్యదర్శి కేఎన్ కృష్ణ, సీపీఐ జిల్లా కార్యదర్శి కాసా రాంబాబు, బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నల శ్రీనివాసరావు, రైతుసంఘ జిల్లా నాయకుడు ఏవూరి గోపాలరావు, ఎంహెచ్‌పీఎస్ రాష్ట్ర కార్యదర్శి షేక్ మస్తాన్‌వలి, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గోదా జాన్‌పాల్, బహుజన హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు గోదా రమేష్‌కుమార్, కేఎన్‌పీఎస్ నాయకుడు జక్కా బ్రహ్మయ్య, పెద్దసంఖ్యలో కాలనీవాసులు పాల్గొన్నారు.
వెంటనే క్వార్టర్లు ఖాళీ
చేయాలంటూ హుకుం
నిరసనగా కలెక్టర్ కార్యాలయ
ఆవరణలో రోడ్డుపై ఆందోళన
చేపట్టిన కాలనీవాసులు
పునరావాసం చూపేవరకు ఖాళీచేసే
ప్రసక్తి లేదంటున్న కాలనీవాసులు


