అమరేశ్వరుని భూములు అన్యాక్రాంతం! | - | Sakshi
Sakshi News home page

అమరేశ్వరుని భూములు అన్యాక్రాంతం!

Jan 4 2026 10:57 AM | Updated on Jan 4 2026 10:57 AM

అమరేశ్వరుని భూములు అన్యాక్రాంతం!

అమరేశ్వరుని భూములు అన్యాక్రాంతం!

అమరేశ్వరుని భూములు అన్యాక్రాంతం!

సర్వీసు దారులకు నోటీసులు ఇస్తాం..

సేవలు చేయకున్నా పట్టించుకోని వైనం..

అమరావతి: రాజధానికి దగ్గరగా ఉండటంతో అమరావతి పరిసర ప్రాంతాల్లోని భూముల ధరలు ఆకాశాన్నంటాయి. భూములకు విపరీతంగా డిమాండ్‌ పెరిగిన నేపధ్యంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అమరావతి క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ బాల చాముండికా సమేత అమరేశ్వరస్వామివారి ఆలయ భూములు, సర్వీస్‌ ఈనాం భూములపై బడాబాబులు కన్నేశారు. ఈ భూములు నాలుగవ వంతు ధరకే అమ్మకాలు సాగిస్తుండటంతో నేడు దేవుని భూములు అన్యాక్రాంతమయ్యే ప్రమాదం ఏర్పడింది.

అన్యాక్రాంతమవుతున్న

దెందుకూరు భూములు..

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అమరావతి క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీబాలచాముండికా సమేత అమరేశ్వరస్వామివారికి చెందిన ఖమ్మం జిల్లా దెందుకూరులో ఉన్న 410.34 ఎకరాలు భూమిని నేటికీ నామమాత్రపు కౌలుపైన సాగులో ఉన్నాయి. దెందుకూరు భూములకు ఈనాటికీ బహిరంగవేలం నిర్వహించలేని దుస్థితిలో దేవదాయశాఖ ఉందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మాదల, దమ్మాలపాడు, దొండపాడు, దావులూరు, అమరావతి గ్రామాలలో 267.28 ఎకరాలు, పూర్వం దాతలు ఆలయానికి విరాళంగా అందించడం జరిగింది. ఈభూములకు కూడా రైతుల భూములకు వచ్చినంత కౌలు రాకపోయినా సరిపెట్టుకోవాల్సి వస్తుంది.

నిషేధిత జాబితాలో ఉన్నా

ఆగని లావాదేవీలు..

దేవాలయ సర్వీస్‌ ఈనాం భూములు అటు తహసీల్దార్‌ కార్యాలయంలో, ఇటు రిజిస్ట్రార్‌ కార్యాలయంలో నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ అమ్మకాలు ఆగటం లేదు. ఆర్‌ఎస్‌ఆర్‌ రిజిస్టర్‌లో అమరేశ్వరస్వామి పేరుమీద ఈ భూములు నమోదు కావటంతో కొంతమంది 30 నుంచి 50 సంవత్సరాలకు లీజుకు తీసుకుని తమ స్వాధీనంలోకి తీసుకుంటున్నారు. మరికొంత మంది అగ్రిమెంట్‌లు రాయించుకుంటున్నారు. ఈ విషయంలో దేవదాయశాఖ అధికారులు నోటీసులు ఇచ్చి సరిపెట్టుకుంటున్నారు. దేవునిభూముల విషయంలో అధికారులు సమర్ధవంతంగా చర్యలు తీసుకోవటం లేదని భక్తులు అభిప్రాయపడుతున్నారు.

కొనసాగుతున్న లావాదేవీలు...

రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు సర్వీస్‌ దారులకు ఈనాంగా ఇచ్చిన 192.96ఎకరాల భూమి రోడ్డపక్కనే ఉండటంతో ఈ భూములపై బడాబాబుల చూపు పడింది. ఇందులో సంగీత కళాకారులకు ఈనాంగా ఇచ్చిన 89 సర్వే నంబరులోని 10.70 ఎకరాలు దేవాలయం స్వాధీనం చేసుకోగా.. మిగిలిన సర్వే నెంబర్లు 201,124, 202, 86–2, 171, 63,62 132, 190, 77, 175, 184, 32, 83, 144లలో ఉన్న 192.36 ఎకరాల భూమిని సర్వీస్‌ ఈనాంలుగా, మాన్యాలుగా ఇవ్వటం జరిగింది. సర్వీస్‌ ఈనాంలు పొందిన సర్వీస్‌ దారులు కొంతమంది సేవ చేయకపోయినా.. దేవుని భూముల్లో ప్రస్తుతం కొన్నింటికి పట్టాలు పుట్టించి అమ్మకాలు జరిపినట్లు సమాచారం. అలాగే మరికొన్నింటికి రెవెన్యూశాఖ ద్వారా పాసు పుస్తకాలు సంపాదించి బ్యాంకులలో రుణాలు తీసుకున్నారు. అలాగే 2014లో రాజధానిగా అమరావతిని ప్రకటించటంతో కొంతమంది ఈనాందారులు తమ అనుభవంలో గల భూములను తాకట్టు పెట్టటం, లీజు ఒప్పందాలతో రూ.లక్షలు సొమ్ము చేసుకున్నారు. మళ్లీ ప్రస్తుతం అవే భూములకు అగ్రిమెంట్‌లు రాయటానికి ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఎకరా భూమి రూ.కోట్లు పలుకుతుండగా సర్వీస్‌, ఈనాం భూములు రూ.లక్షల్లో ధర ఉండటంతో బడాబాబుల కన్ను వీటిపై పడింది. సర్వీస్‌, ఈనాం భూముల అనుభవదారులవద్ద ఉన్న పట్టాదారు పాస్‌ పుస్తకాలతో కొంతమంది రిజిస్టర్‌ చేయటం, లీజ్‌కు రాయటం జరుగుతున్నాయి. ఆర్‌ఎస్‌ఆర్‌ రిజిస్టర్‌ అమరేశ్వరస్వామి పేరు మీద ఉన్న నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ లావాదేవీలు జరుపుతున్నారు. ఇటీవల ఒక సర్వే నెంబరులోని భూమిని రికార్డుల్లో వేరే వారి పేరు మార్చటానికి రూ.లక్షలు చేతులు మారాయని సమాచారం. ఇప్పటికై న దేవదాయశాఖ అధికారులు అన్యాక్రాంతమవుతున్న దేవుని భూములను కాపాడాలని భక్తులు కోరుతున్నారు.

అమరేశ్వరస్వామి దేవస్థానం

అమరావతిలోని సర్వీస్‌, ఈనాం భూములన్నీ అమరేశ్వరునివే, రెవెన్యూ ఆర్‌ఎస్‌ఆర్‌ రికార్డులలో అమరేశ్వరస్వామికి చెందిన భూములుగానే ఉంటాయి. వీటిపై జరిగే అనధికార లావాదేవీలకు దేవాలయానికి ఎటువంటి సంబంధం లేదు. ఈ భూముల సర్వే నెంబర్లను నిషేధిత జాబితాలో ఉంచాం. త్వరలో సర్వీసు దారులకు నోటీసులు ఇచ్చి, వారి భూములను సర్వే చేయిస్తాం

– రేఖ, అమరేశ్వరాలయ కార్యనిర్వహణాధికారి

రాజధాని సమీపంలోని భూములకు అధిక డిమాండ్‌

సర్వీసు, ఈనాం భూములపై

బడాబాబుల కన్ను

30 నుంచి 50 ఏళ్లకు లీజ్‌లకు ఇస్తున్న కొంతమంది సర్వీసుదారులు

వందలాది ఎకరాల దేవుని భూములు అన్యాక్రాంతమయ్యే అవకాశం

పట్టాదారు పాస్‌ పుస్తకాలు, అడంగల్‌ కాపీలు ఉంటేనే రూ.లక్షల్లో చెల్లింపులు

కొన్ని భూములకు రికార్డుల్లో పేరు మార్పుకోసం చేతులు

మారుతున్న రూ.లక్షలు

దేవదాయ అధికారుల నిర్లక్ష్యం..

సర్వీసు దారులకు వరం

స్వామివారికి వెండికర్ర, సంగీతమాన్యం, మద్దెల, ప్రమిదలు, కాగడా, శంఖు, భజంత్రీలకు ఆనాడు రాజావాసిరెడ్డి వెంకటాద్రినాయుడు స్వామివారికి సేవ చేసినందుకు అనుభవించటానికి మాత్రమే సుమారు 192 ఎకరాల భూమిని అమరావతి పరిసర ప్రాంతాలలో ఇవ్వటం జరిగింది. కానీ ప్రస్తుతం కొందరు స్వామివారికి నామమాత్రంగా సేవలు నిర్వహిస్తుండగా.. మరికొందరు అసలు సేవల జోలికి పోవడం లేదు. వీరి భూములను దేవదాయశాఖ అధికారులు ఎందుకు అధీనంలోకి తీసుకోవటం లేదో అమరేశ్వరునికే తెలియాలి మరీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement