న్యూ ఇయర్ ‘కిక్కు’
రూ.11.93 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు
నరసరావుపేట టౌన్: చంద్రబాబు సర్కార్ మందు బాబులకు న్యూఇయర్ ‘కిక్’ ఎక్కించింది. నూతన సంవత్సర సందర్భంగా డిసెంబర్ 31, జనవరి 1వ తేదీలలో పగలు, రాత్రి తేడా లేకుండా సర్కార్ జనాన్ని మత్తులో ముంచింది. దీంతో గత సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా న్యూఇయర్ వేడుకల సందర్భంగా జిల్లా ఆబ్కారీ శాఖ ఆదాయం పెరిగింది. సాధారణ రోజుల్లో జిల్లాలోని 48 బార్లు, 129 వైన్‌షాపుల్లో రోజుకు రూ. 3 కోట్ల చొప్పున వ్యాపారం జరుగుతుంది. అయితే న్యూఇయర్ వేడుకల్లో భాగంగా డిసెంబర్ 30వ తేదీ ఒక్క రోజునే సుమారు రూ.7.89 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎకై ్సజ్‌అధికారులు అంచనావేస్తున్నారు. ఇదే విధంగా డిసెంబర్ 31న రూ.4.04 కోట్లు, జనవరి 1వ తేదీన రూ.84.04 లక్షల మద్యం అమ్మకాలు డిపో నుంచి జరిగాయి. ప్రైవేటు దుకాణాలు కావడంతో వారం రోజుల ముందు నుంచే మద్యం ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసి స్టాక్ పెట్టారు. ఈ లెక్కలు కేవలంనరసరావుపేట డిపో పరిధిలోని చిలకలూరిపేట, నరసరావుపేట, గురజాల, ఈపూరు, మాచర్ల, వినుకొండ, పిడుగురాళ్ల సర్కిల్ పరిధిలోని అమ్మకాలు మాత్రమే. పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి, క్రోసురు, అచ్చంపేట మద్యం దుకాణాలకు గుంటూరు డిపో నుంచి మద్యం సరఫరా అవుతుంది. అక్కడ సైతం న్యూఇయర్‌కు భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి.


