గ్రామాల్లో అరాచక పాలన
వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు
వినుకొండ: కూటమి ప్రభుత్వం హయాంలో గ్రామాల్లో అభివృద్ధికి బదులు అరాచక పాలన సాగుతోందని పల్నాడు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో బడుగు, బలహీన వర్గాలపై, పేదలపై, వైఎస్సార్ సీపీ అభినుమాలపై యథేచ్ఛగా దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. శావల్యాపురం మండలం గంటవారిపాలెంలో ఎస్టీ వర్గానికి చెందిన వారిని వైఎస్సార్ సీపీ సానుభూతిపరులుగా గుర్తించిన టీడీపీ నాయకులు వేల్పూరు, గంటవారిపాలెంలోని వారి దుకాణాలను ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ ఘటనలో పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేయలేదని అన్నారు. మహిళ అని కూడా చూడకుండా ఆమె వస్త్రాలలో దాచిన సెల్‌ఫోన్‌ను సైతం దుర్మార్గంగా లాక్కున్నారని ఆరోపించారు. అలాగే ఈపూరు మండలం బొమ్మరాజుపల్లి గ్రామంలో కొండవర్జు నాగేశ్వరరావుపై అక్రమ కేసులు బనాయించి పోలీసులు ఇబ్బందులకు గురిచేశారన్నారు. బొల్లాపల్లి మండలం పలుకూరు తండాలో 65 ఏళ్ల వృద్ధుడిపై, కొచ్చర్ల గ్రామంలో బాలుడిపై దాడి చేశారని చెప్పారు. పోలీసులు కూడా టీడీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుకు కేబినెట్ హోదాలో చీఫ్ విప్ పదవి వచ్చినప్పుడు వినుకొండ అభివృద్ధి చెందుతుందని అందరూ ఊహించారన్నారు. దానికి భిన్నంగా గ్రామాల్లో అభివృద్ధికి బదులు అరాచక పాలన సాగుతోందని గుర్తు చేశారు. నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ బ్యానర్ కనిపించకుండా చేశారని, గతంలో ఇలాంటి పాలన ఎక్కడా చూడలేదన్నారు. బ్యానర్ కడితే కేసులు, జై జగనన్న అంటే కేసులు పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారని దుయ్యబట్టారు.
చేతనైతే అభివృద్ధి చేయండి...
వినుకొండలో గత ప్రభుత్వం హయాంలో ఆగిపోయిన అభివృద్ధి పనులైనా చేపట్టాలని జీవీకి బ్రహ్మనాయుడు సూచించారు. వంద పడకల ఆసుపత్రి, ముస్లిం కళాశాల, షాదీఖానా, మున్సిపల్ స్టేడియం, రైతు బజారు, గిరిప్రదక్షిణ రోడ్డు వంటి అభివృద్ధి పనులు చేపట్టాలని పేర్కొన్నారు. అరాచక పాలన మానుకోవాలని సూచించారు. కాగా, ఇటీవల జమ్మూకశ్మీర్‌లో పర్యాటకులపై పాక్ ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని పొట్టన పెట్టుకున్నారని, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు బొల్లా అన్నారు.


